సజ్జ రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సజ్జ రైతుల ఆందోళన

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

కంపెనీ ఒప్పందంతో

200 ఎకరాల్లో సాగు

దిగుబడులు కొనుగోలు చేయని వైనం

చాగలమర్రి: డి.కొత్తపల్లె గ్రామానికి చెందిన రైతులు హైదరాబాద్‌కు చెందిన సూపర్‌ సీడ్స్‌ కంపెనీ చేతిలో మోసపోయి లబోదిబోమంటున్నారు. సంబంధిత కంపెనీ ఒప్పందం మేరకు గ్రామానికి చెందిన 20 మంది రైతులు 200 ఎకరాల్లో బాజ్రా–99 రకం సజ్జ పంట సాగు చేశారు. క్వింటాకు రూ.4,400 ప్రకారం పంట కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పంట కోతలు పూర్తయి ఎకరానికి 23 బస్తాల ప్రకారం దిగుబడి వచ్చింది. రైతులు దిగుబడిని కంపెనీకి విక్రయించేందుకు ఆర్గనైజర్‌ శ్రీనివాసరెడ్డితో మాట్లాడినా స్పందన లేదు. కంపెనీ ఎండీ నిర్లక్ష్యం వహిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 3,800ల క్వింటాళ్ల దిగుబడిలో ఆర్గనైజర్‌ శ్రీనివాసరెడ్డి 1,200 క్వింటాళ్లను చాగలమర్రిలోని గోదాముకు తరలించి నట్లు చెబుతున్నారు. మిగిలిన రైతులకు చెందిన ధాన్యాన్ని కలాల్లోనే నిల్వ ఉంచారు. అకాల వర్షాలు వస్తే దిగుబడి తడిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు పెద్ద ఈశ్వరరెడ్డి, విక్రమ నరసింహారెడ్డి, దస్తగిరిరెడ్డి, సుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, పెద్ద నరసింహారెడ్డి, నాగరాజు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఈ విషయమై చొరవ చూపి కంపెని అధికారులతో మాట్లాడి సజ్జలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement