మలేరియా నిర్మూలనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మలేరియా నిర్మూలనే లక్ష్యం

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా వ్యాప్తంగా 2,030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వై.కామేశ్వర ప్రసాద్‌ చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక డాక్టర్స్‌ కాలనీలోని రాయలసీమ నర్సింగ్‌ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ మాట్లాడుతూ మలేరియాను నిర్మూలించాలనే నినాదంతో పట్టణ/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు, కరపత్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దోమల ద్వారా కలిగే మలేరియా... ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి వల్ల వస్తుందని, జ్వరంతో పాటు చలి, వణుకు, తలనొప్పి, వాంతులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలు, వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్న వారు ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మలేరియా నియంత్రణ అధికారి నూకరాజు మాట్లాడుతూ మురుగునీటిలో ఉత్పత్తయ్యే దోమల మూలంగా బోధకాల వ్యాధి వస్తుందన్నారు. కార్యక్రమంలో మాస్‌ మీడియా అధికారి ప్రకాష్‌రాజు, యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ చంద్రకళ, సీనియర్‌ ఎపిడమాలజిస్టు వెంకటేశ్వర్లు, ఏఎంఓ ఎస్‌.విజయకుమార్‌, ఎంపీహెచ్‌ఎస్‌ అస్లాం, రఘు, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement