● జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(అర్బన్): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులకు శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. గతంలో ఎంపీడీఓగా విధుల్లో చేరిన వారు ఎంపీడీఓగానే పదవీ విరమణ చేసేవారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల డివిజినల్ స్థాయిలో డీఎల్‌డీఓ పోస్టులను క్రియేట్ చేయడంతో పీఆర్‌లో పదోన్నతుల పర్వం ప్రారంభం అయ్యిందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనే ధ్యేయంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే ప్రజలు 542 రకాల సేవలను పొందగలుగుతున్నారన్నారు. 33వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు.
ఆర్థిక సంఘం నిధులు
విడుదల కావడం లేదు
జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో 2007, 2008 సంవత్సరాల్లో దాదాపు 9 శాఖలకు చెందిన నిధులు, విధులు, అధికారాలను పంచాయతీరాజ్ వ్యవస్థకు బదలాయించారన్నారు. కాలక్రమేణ కొన్ని మాత్రమే కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా 2016 తరువాతి నుంచి విడుదల కావడం లేదన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు, ముఖ్యంగా జిల్లా పరిషత్ అవసరాలకు అనుగుణంగా విడుదల కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దామాషాలో విడుదల చేయడం లేదన్నారు. భూగర్భ ఖనిజ శాఖ వసూలు చేసి రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధికి జమ చేసిన రాయల్టీకి, పంచాయతీరాజ్ వ్యవస్థలకు విడుదల చేస్తున్న గ్రాంట్ల మధ్య ఎక్కువ శాతం వ్యత్యాసం ఉందన్నారు. దీని వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థలు ఆర్థికంగా బలోపేతం కాలేకపోతున్నాయన్నారు.
సమన్వయంతో ముందుకు వెళ్లాలి
స్టాంప్ డ్యూటీకి సంబంధించిన సర్దుబాటును కూడా సకాలంలో చేయడం లేదని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఉన్న పెండెన్సీపై 2022 నుంచి రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి చేస్తూ వస్తే గత ఆర్థిక సంవత్సరం కొంత మేర పెండెన్సీ తగ్గిందన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశం నెరవేరాలంటే, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు 1993లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిందన్నారు. అప్పటి నుంచే దేశంలో మూడంచెల వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం పరిపాలన సాధ్యమైందన్నారు. డీపీఓ జీ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌళిక సౌకర్యాలు కల్పిస్తు, వారి మనోభావాలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు.


