● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కల్లూరు: ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడంలో పీఎండీఎస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో ధర్తీ మాతా బచావ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు పీడీఎంఎస్ విత్తనాల కిట్లను అందజేశారు. ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన అనంతరం రైతు పీడీఎంఎస్ విత్తనాలను చల్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎండీఎస్ అంటే వర్షాధారిత ప్రాంతాలలో, భూమిలో తేమ లేనప్పుడు విత్తనాలు వేసే విధానమన్నారు. ఈ ప్రక్రియ ద్వారా వేసవిలో భూమి ఖాళీగా ఉన్నప్పుడు, వర్షాలు పడటానికి ముందే (మే –జూన్ సమయంలో) 30 రకాల నవధాన్యా లు, ఇతర విత్తనాలను కలిపి పొలంలో చల్లుతారన్నారు. ఈ విత్తనాలు వర్షం పడగానే మొలకెత్తి, భూమికి అవసరమైన పోషకాలను అందిస్తాయన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పీ ఎల్ వరలక్ష్మీ, డిపిఎం మాధురి, సహాయ వ్యవసాయ సంచాలకులు సాలురెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, ఎఓ విష్ణువర్ధన్‌రెడ్డి, హార్టికల్చ ర్ ఆఫీసర్ నరేష్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ కొరత లేదు
కర్నూలు (సెంట్రల్): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని డీఎస్‌ఓ ఎం.రాజారఘువీర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కర్నూ లు నగరంలోని పలు పెట్రోల్ బంకులను పరిశీలించారు. నిల్వలు ఉండి వాహనదారులకు విక్రయించకపోతే కఠిన చర్యలు తప్పవని పెట్రోల్ బంకుల యజమానులను హెచ్చరించారు. అధిక ధరలకు విక్రయిస్తే బంకులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
24లోగా ఫీజు చెల్లించాలి
కర్నూలు సిటీ: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలకు నిర్దేశించిన గడువులోపు ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియేట్ విద్యా మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజుల చెల్లింపు ప్రక్రియ శుక్రవారం మొదలైందని, ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందని, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు ఫీజు గడువు తెలియజేయాలన్నారు.
ఉదయమే దిగుబడులు తీసుకురావాలి
కర్నూలు(అర్బన్): ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున మార్కెట్‌యార్డుకు రైతులు తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి ఉదయం 9 గంటల్లోపు తీసుకు రవావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలియజేసిన సమయానికే వ్యాపారులు కూడా టెండర్ వేయాలన్నారు.
నేటి నుంచి ఫ్యాఫ్టో రిలే దీక్షలు
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో నేటి(శనివారం)నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం కర్నూలు డీఈఓ ఆఫీస్ ఆవరణలో ఫ్యాఫ్టో నాయకులు విడుదల చేశారు. దీక్షల్లో భాగంగా ఆదివారం ఫ్యాఫ్టో కర్నూలు కమిటీ కూర్చోనుందని జిల్లా కమిటీ చెర్మన్ ఎం.మధుసూదన్ తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. ఫ్యాఫ్టో నాయకులు బి.నవీన్ పాటిల్, రవికుమార్, మరియానందం, ఇస్మాయిల్, యోగేశ్వరుడు, నరేంద్ర నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నేడు పాలిసెట్
ఆదోని సెంట్రల్: పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష శనివారం జరుగుతుందని ఆదోని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నపరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదోనిలో 1500 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నట్లు , మొత్తం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.


