యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

యువకుడి దారుణ హత్య

ఓర్వకల్లు: మండల పరిధిలోని ఉయ్యాలవాడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామస్తుల కథనం మేరకు.. ఈడిగోటి లలితమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మనోజ్‌కు గత నెల ఓర్వకల్లు మండలం చింతలపల్లెకి చెందిన వెంకటేశ్వరితో వివాహమైంది. రెండేళ్లుగా వెంకటేశ్వర్లు కర్నూలు నగరంలోని జంపాల ఈశ్వరయ్య నగర్‌లో ఉంటూ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 21 నుంచి 23 వరకు గ్రామంలో జరిగే ఉత్సవాలకు కుటుంబ సమేతంగా వచ్చారు. ఉత్సవాల్లో పోలీసుల అనుమతితో గురువారం రాత్రి డీజే ఏర్పాటు చేయగా పాటల విషయంలో గ్రామానికి చెందిన వంశీ, మనోజ్‌ సోదరుడైన మధుబాబుతో గొడవ పెట్టుకున్నాడు. గమనించిన మనోజ్‌ సర్దిచెప్పే క్రమంలో వాగ్వాదం చోటుచేసుకొంది. కోపోద్రికుడైన వంశీ పొడవాటి కత్తిని తీసుకుని, కుటుంబసభ్యులతో కలిసి మనోజ్‌ ఇంటివద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ సమయంలో కరెంట్‌ పోవడంతో అరుగుపై కూర్చొన్న మనోజ్‌ను పక్కకు ఈడ్చి గొంతుపై కత్తితో పొడిచాడు. అపస్మారక స్థితికి చేరుకున్న మనోజ్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. కాగా, డీజే ప్రదర్శనకు అనుమతినిచ్చిన పోలీసులు బందోబస్తు నిర్వహించకుండా, యువకుల మధ్య గొడవలో జోక్యం చేసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. కేవలం 100 మీటర్ల దూరంలో యువకుడి హత్య జరుగుతున్నప్పటికీ ఖాకీలు అడ్డుకోకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమంటూ స్థానికులు మండిపడుతున్నారు.

వడ్డెర సంఘం నాయకుల అందోళన

వడ్డెర సంఘం నేతలు వందలాది మందితో కలిసి మృతదేహాన్ని వంశీ ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేశారు. హంతకుడైన వంశీని తక్షణమే ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో వంశీతో పాటు, లక్ష్మీనారాయణ, రేణుక, వెంకటలక్ష్మి, శ్రీరాములు అనే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement