కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 22 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. రెండవ సెమిస్టర్ పరీక్షలకు 214 మందికి 196 మంది విద్యార్థులు హాజరు కాగా 18 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 31 మందికి 27 మంది హాజరు కాగా నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు.
స్కూళ్లకు వేసవి సెలవులు
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్లారు. విద్యా సంవత్సరం చివరిగా నిర్వహించే సమ్మెటివ్–2 పరీక్షలు ఈ నెల 16వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షల మూల్యాంకనం నిర్వహించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందజేశారు. సెలవులు ప్రకటించిన తరువాత సమ్మర్ క్యాంపు పేరుతో ప్రత్యేక తరగతుల పేరుతో స్కూళ్లలో క్యాంప్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో(హాస్టల్స్ మినహా)చదువుతున్న విద్యార్థులకు బియ్యంతో పాటు కోడి గుడ్లు, చిక్కీలను పంపిణీ పంపిణీ చేశారు.
కర్నూలు సిటీ: జిల్లా విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను డీఈఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల యాజమాన్యాల కింద పని చేస్తున్న ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్‌ఎం సీనియారిటీ జాబితాలను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించామన్నారు. ఈ జాబితాలను www.doekrnl13.blogspot.com అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27వ తేదీలోపు(పని దినాల్లో మాత్రమే) డీఈఓ కర్నూలు(ఉమ్మడి జిల్లా) ఆఫీస్‌లో సా యంత్రం 5 గంటల్లోపు తగిన ఆధారాలతో ఇవ్వాలన్నారు. గడువు తరువాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోరని డీఈఓ వెల్లడించారు.
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
డోన్ రూరల్: ఉద్యోగం రావడం లేదని ఓ యువకుడు గురువారం ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన డోన్ పట్టణంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ధీరజ్(31) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడం, పెళ్లి కాకపోవడంతో మనస్తాపం చెందాడు. డోన్ పట్టణంలోని తన మేనమామ ఇంటికి వచ్చి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈతకు వెళ్లి బాలుడి మృతి
దేవనకొండ: మండలంలోని గుడిమిరాళ్ల గ్రామానికి చెందిన కౌశిక్(12) గురువారం ఈతకు వెళ్లి బావిలో చిక్కుకుని మృతిచెందాడు. కౌలుట్ల, వరలక్ష్మీ దంపతుల కుమారుడైన కౌశిక్ ఆరో తరగతి చదువుతున్నాడు. మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుడి మృతిపై అనుమానం ఉందని, పోలీసులు విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలుడి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


