● నేర సమీక్ష సమావేశంలో
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. పీజీఆర్‌ఎస్ పిటిషన్లను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఫోక్సో కేసులలో 60 రోజుల లోపు చార్జి షీట్లు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి రికవరీ శాతాన్ని పెంచాలన్నారు.
నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం ఊడుతుంది!
డయల్ 112 కాల్స్‌పై నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగం ఊడుతుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయాలని, రాత్రి గస్తీలు, విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. రాత్రివేళల్లో గస్తీ తిరిగే పోలీసు బృందాలు మొబైల్ చెక్ డివైజ్ పరికరంతో అనుమానితుల వేలిముద్రలను సేకరించాలని, అది నేర పరిశోధనకు బాగా పనిచేస్తుందన్నారు. సీసీఎస్ పోలీసులు పనితీరును మెరుగుపరచుకోవాలని, గట్టిగా పనిచేయకపోతే శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రొబేషనరీ ఎస్‌ఐలు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, భార్గవి, సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.


