కనీస వేతనం ఇవ్వకపోతే మరో సుదీర్ఘ సమ్మె | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనం ఇవ్వకపోతే మరో సుదీర్ఘ సమ్మె

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

కర్నూలు(అర్బన్‌): తమకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని లేదంటే మరో సుదీర్ఘ సమ్మె చేస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్నారు. అంగన్‌వాడీ యూనియన్ల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు గురువారం స్థానిక అర్బన్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా సీ క్యాంప్‌ సెంటర్‌ నుంచి అర్బన్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు జే లలితమ్మ, సీఐటీయూ జిల్లా కోశాధికారి గోపాల్‌ మట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ తప్పారని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు, నెల రోజులు వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీలపై అదనపు భారాన్ని తగ్గించాలని, సర్వేలు, పెన్షన్ల పంపిణీ, బీఎల్‌ఓ డ్యూ టీలు వేయరాదన్నారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో గత రెండు సంవత్సరాలుగా వేసవి సెలవులు ఇస్తుంటే ఇక్కడ అమలు చేయడంలేదన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడీ యూనియన్లతో చర్చలు జరిపి వేతనాలను పెంచాలని, సెలవులను మంజూరు చేయాలన్నారు. సీఐటీయూ నాయకులు ఆర్‌ నరసింహులు, కే సుధాకరప్ప, మహమ్మద్‌ రఫీ, బాలదర్గమ్మ, చౌడేశ్వరి, నాగమణి, విజయ మంజుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement