మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

మత్తు వ్యసనాల నిర్మూలన ర్యాలీలో

కలెక్టర్‌, ఎస్పీ పిలుపు

కర్నూలు: కర్నూలును మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేద్దామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పిలుపునిచ్చారు. నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించేందుకు ఈగల్‌ ఆధ్వర్యంలో గురువారం భారీ వాకథాన్‌ ర్యాలీ నిర్వహించారు. రాజ్‌విహార్‌ సెంటర్‌లో కలెక్టర్‌, ఎస్పీ జెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. ఈగల్‌ టీమ్‌ ఎస్‌ఐ సుజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసు, ఎకై ్సజ్‌, విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సే నో టు డ్రగ్స్‌, డ్రగ్‌ ఫ్రీ సొసైటీ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సందేశాలందించారు. రాజ్‌విహార్‌ నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ సాగింది. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈగల్‌ టీమ్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1972కు సమాచారం ఇవ్వాలని యువత నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ.. యువతను మత్తు వ్యసనాల నుంచి కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆల్కహాల్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, దీనివల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ నోడల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి, జిల్లా అధికారి సుధీర్‌ బాబు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణా రెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ హరిహర తేజ, సీఐలు చంద్రహాస్‌, రాజేంద్రప్రసాద్‌, జయరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement