● అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి
ఆదోని అర్బన్: ‘ఎండాకాలంలో నీరు వదలకపోతే ప్రజలు ఎలా జీవించేది.. తమాషా చేస్తున్నారా.. నీరు వదలకపోతే నేనే అక్కడికి వచ్చి కూర్చుంటా... వెంటనే నీరు వదలండి.. లేదంటే ట్యాంకర్లను అయినా పంపండి’ అంటూ అధికారులపై ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలోని బండిమెట్ట కాలనీవాసులు వారం రోజులైనా నీరు వదలడంలేదని బిందెలు పట్టుకుని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి స్వగృహానికి బుధవారం వచ్చారు. దీంతో ఆశ్చర్యపోయిన మాజీ ఎమ్మెల్యే... తన దగ్గరకు ఎందుకు వస్తారు, ఎమ్మెల్యే ఉన్నారు కదా అక్కడికి వెళ్లండి అని సమాధానం చెప్పారు. దీంతో కాలనీవాసులు ‘ఎమ్మెల్యే ఎక్కడున్నాడు.. యాడుంటారో మాకు తెలియదు... మాకు మీరే ఎమ్మెల్యే మీరే అన్నీ’ అని చెప్పడంతో వెంటనే మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సంబంధిత మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశారు. నీరు వదలాలని, లేదంటే ట్యాంకర్లను అయినా పంపాలని ఆదేశించారు. నీరు వదలకపోతే నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను అని హెచ్చరించారు. వెంటనే నీరు వదిలి తన ఫోన్ చేయాలన్నారు. అధికారులకు ఫోన్ చేసిన గంటలోనే సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో ప్రజలు తమ దాహార్తిని తీర్చిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.


