పోలీసు శాఖలో బదిలీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో బదిలీలు

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

15 మంది ఏఎస్‌ఐలు

25 మంది హెడ్‌కానిస్టేబుళ్లు బదిలీ

93 మంది కానిస్టేబుళ్లు కూడా

పట్టణాల్లో పాతుకుపోయిన వారికి గ్రామీణ స్టేషన్లకు బదిలీ

కర్నూలు : పోలీసు శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయ ఉత్తర్వుల మేరకు సాధారణ బదిలీల్లో భాగంగా బుధవారం 15 మంది ఏఎస్‌ఐలు, 25 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 93 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 133 మందిని బదిలీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరాతో కలసి కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియను పూర్తి చేసి అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు పూర్తిచేసుకున్న పోలీసులకు నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టారు. గతంలో పనిచేసిన పోలీస్‌స్టేషన్లు కాకుండా సొంత మండలం, నియోజకవర్గం మినహాయించి ఇతర పోలీస్‌స్టేషన్లలో ఖాళీగా ఉన్న వాటిని బోర్డుపై చూపించి ఐదు ఆప్షన్లు ఇచ్చి కోరుకున్న స్థానాలకు నియమిస్తూ బదిలీ చేశారు. బదిలీ అయినవారు ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్‌ విధుల నుంచి వెంటనే వైదొలిగి కేటాయించిన స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టాలని ఎస్పీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మెసేజ్‌ ద్వారా కౌన్సెలింగ్‌కు పిలుపు...

బదిలీలకు సంబంధించిన జాబితా ముందుగానే సిద్ధం చేసి శాంతి భద్రతలు, ట్రాఫిక్‌, మహిళతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారికి కమ్యూనికేషన్‌ విభాగం ద్వారా ముందురోజు మెసేజ్‌ రూపంలో సమాచారం పంపారు. ఉదయమే సిబ్బంది అంతా జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్‌ స్టేషన్లతో పాటు వివిధ విభాగాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐ వరకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనారోగ్యం, స్పౌజ్‌ కేసులకు ప్రాధాన్యత కల్పించారు. పోలీసు సిబ్బందికి కోరుకున్న చోటుకే నియమించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు సిబ్బంది తరఫున ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీపీఓ ఏఓ విజయలక్ష్మితో పాటు సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement