జూనియర్‌ పేరుతో సీనియర్‌ ర్యాగింగ్‌ మెసేజ్‌లు | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ పేరుతో సీనియర్‌ ర్యాగింగ్‌ మెసేజ్‌లు

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

● కేఎంసీలో ర్యాగింగ్‌ విషయంపై విచారణ ● సీనియర్‌ల మధ్య గొడవే కారణమని అధికారుల వెల్లడి

● కేఎంసీలో ర్యాగింగ్‌ విషయంపై విచారణ ● సీనియర్‌ల మధ్య గొడవే కారణమని అధికారుల వెల్లడి

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కాలేజీ లోని వసతి గృహంలో ఎంబీబీఎస్‌ చదువుతున్న సీనియర్‌ విద్యార్థుల అంతర్గత సమస్యలతోనే ర్యాగింగ్‌ పేరుతో మెసేజ్‌ల రూపంలో ఫిర్యాదు చేశారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ వెల్లడించారు. బుధవారం ఆమె తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కాలేజీలో ఎలాంటి ర్యాగింగ్‌ జరగలేదని తమ విచారణలో తేలిందన్నారు. కళాశాలలో ర్యాగింగ్‌ జరుగుతోందంటూ పదే పదే ఈమెయిల్‌ మెసేజ్‌లు వస్తుండగా వాటి తీవ్రత దృష్ట్యా కళాశాల ర్యాగింగ్‌ వ్యతిరేక కమిటీ మూడు రోజుల పాటు వసతి గృహంలో విచారణ జరిపిందన్నారు. ఇందుకు పోలీసుల సహకారం కోరామన్నారు. తమ విచారణలో వసతి గృహంలో, కళాశాలలో ఉన్న విద్యార్థులందరినీ ప్రశ్నించామని, భయపడకుండా నేరుగా తమ వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పాలని చెప్పినా ఎవ్వరూ ర్యాగింగ్‌ జరుగుతున్నట్లు చెప్పలేదన్నారు. మెయిల్స్‌ను పోలీసులు ఛేదించగా అసలు విషయం బయటపడిందన్నారు. ప్రస్తుతం ఫైనలియర్‌కు వెళ్లబోతున్న ఓ సీనియర్‌ విద్యార్థి తన మెయిల్‌ నుంచి మూడో సంవత్సరం విద్యార్థి పేరుతో తప్పుడు మెయిల్స్‌ పంపించినట్లు వెల్లడైందన్నారు. వారిద్దరినీ పిలిచి ఆధారాలతో విచారణ చేయగా తామే చేసినట్లు తెలిపారన్నారు. సీనియర్‌ల మధ్య ఉన్న అంతర్గత సమస్యల కారణంగానే ఇలాంటి మెసేజ్‌లు పెట్టారన్నారు.హాస్టల్‌లో మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండేందుకు ప్రత్యేక భవనం ఏర్పాటు చేశామన్నారు. తప్పుడు మెయిల్స్‌ పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆ విద్యార్థిని హాస్టల్‌ నుంచి పంపించేశామన్నారు. సమావేశంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సింధియా శుభప్రద, డాక్టర్‌ శ్రీరాములు(వార్డెన్‌), యాంటి ర్యాగింగ్‌ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ రామకృష్ణనాయక్‌, టూటౌన్‌ సీఐ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement