ఎమ్మిగనూరురూరల్: ఎవరైనా వ్యాపారులు అనుమతిలేని విత్తనాలు రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడీఏ మహమ్మద్‌ఖాద్రి హెచ్చరించారు. పట్టణంలోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాల్లో బుధవారం ఏవో శివశంకర్లతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడీఏ మాట్లాడుతూ పట్టణంలోని ట్యాంక్ బండ్ రోడ్డులో గల భారత్ సీడ్స్ దుకాణంలో పత్తి విత్తన ప్యాకెట్లను అనుమతి లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. రూ. 3,60,400 విలువ గల 400 ప్యాకెట్లను సీజ్ చేయటంతో పాటు 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే బిస్మిల్లా హైబ్రీడ్ సీడ్స్ దుకాణంలో 129 మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లు అనుమతి లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సీజ్ చేసిన మొక్కజొన్న విత్తనాల విలువ రూ. 1,37,616 ఉంటుందన్నారు.
మలేరియా నివారణ మన చేతుల్లోనే..
కర్నూలు(హాస్పిటల్): మలేరియా నివారణ మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన పెంచుకుని దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ సింధియా శుభప్రద సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు వైద్య విద్యార్థులు గ్రామంలో ఇంటింటికి తిరిగి మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని డాక్టర్ సింధియా సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు వైష్ణవి, పుష్పలత, యాస్మిన్, బ్రయాన్, లెక్చరర్ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


