● వెంకట్రామిరెడ్డిపై వేటు దుర్మార్గ చర్య ● వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్వర్ రెడ్డి
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలన సాగిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఉన్న పార్టీ సమావేశ హాలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించేవారిపై దాడులు, అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించడం కూడా అందులో భాగమేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై గళం విప్పడమే వెంకట్రామిరెడ్డి చేసిన తప్పా అని చంద్రబాబు సర్కారును ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు అన్న ము ద్ర వేసి ఆయనపై వేటు వే యడం దుర్మార్గమన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న అశోక్‌బాబు టీడీపీ కార్యకర్తలా పనిచేశారన్నారు. మరి ఎందుకు ఆయనను అప్పట్లో డిస్మిస్ చేయలేదన్నారు. మీకు అనుకూలంగా ఉంటే ఒక న్యాయం.. ఇతరులకై తే మరో న్యాయమా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన పట్ల ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. త్వరలోనే వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికై నా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో వారు కూటమిసర్కారుకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


