ప్రశ్నించే ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తారా ? | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తారా ?

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

● వెంకట్రామిరెడ్డి తొలగింపు అన్యాయం ● ఉద్యోగులతో పెట్టుకుంటే పుట్టగతులుండవు ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి

● వెంకట్రామిరెడ్డి తొలగింపు అన్యాయం ● ఉద్యోగులతో పెట్టుకుంటే పుట్టగతులుండవు ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి

కర్నూలు (టౌన్‌): ‘ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా వాటిని అమలు చేయలేదు. దీనిపై ఉద్యోగుల సంఘం నాయకుడిగా కె. వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు డిస్మిస్‌ చేస్తారా..? ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది. గళమెత్తే ఉద్యోగులపై కక్ష కట్టి వేధించాలని చూస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి కూటమి సర్కారును హెచ్చరించారు. మంగళవారం ఎస్వీ కాంప్లెక్స్‌లోని తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యాధ్యక్షులు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు కె. వెంకట్రామిరెడ్డిని కూటమి ప్రభుత్వం ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ఉద్యోగ సంఘం నేతపై వేటు వేయడం తగదన్నారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇతర ముఖ్యమంత్రుల కన్నా చంద్రబాబుకు బాగా తెలుసునన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలనే కాకుండా ఇక ఉద్యోగ సంఘం నాయకులపై కూడా ఈ ప్రభుత్వం రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తొందన్నారు. రెండేళ్ల వ్యవధిలోనే టీడీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోందని, ఇప్పటికే రోడ్లెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు. అంగన్‌వాడీలు, ఉపాధ్యాయులు, రైతులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ సమస్యలు పరిష్కారించాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కారించాల్సిన ప్రభుత్వం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలపై నిరంకుశంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు.

పెండింగ్‌ డీఏలు,

పీఆర్సీ ఏమయ్యింది..?

అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు పెండింగ్‌ డీఏలు, పీర్సీ వేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు ఎందుకు అమలు చేయలేదని ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగులకు సంబంధించిన రూ. 40 వేల కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించలేదన్నారు. హక్కుల సాధనకు పోరాడుతున్న ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ఇప్పటికై నా టీడీపీ ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవు పలికారు. ఒంటెద్దు పోకడలకు పోతే భారీ నష్టం తప్పదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement