ఆలూరు: ‘అధికారంలో ఉన్నాం.. మేం ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తాం.. నిబంధనలు అని అడ్డుకుంటే జాగ్రత్త.. రంగుపడుద్ది.. అన్ని బిల్లులు చేయాల్సిందే’ అని ఇంజినీర్లను టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు భవనాలకు రంగులు వేయాలని చెప్పినా వినడం లేదు. ఆలూరు నియోజకవర్గంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్‌టీఆర్ హెల్త్ క్లినిక్ కేంద్రాలు 25 వరకు మంజూరు అయ్యాయి. ప్రతి హెల్త్ క్లినిక్ కేంద్రం భవనానికి రూ. 36 లక్షల నిధులను మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆలూరు మండలంలో మొలగవెల్లి, ఎం.కొట్టాల, అరికెర, కురుకుంద గ్రామ పంచాయతీల్లో ఎన్‌టీఆర్ హెల్త్ క్లినిక్ కేంద్రాలను టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు నిర్మించారు. పూర్తి చేసి భవనాలకు ప్రభుత్వం సూచనలు మేరకు తెలుపు రంగు వాడాలి. అయితే వీరు టీడీపీకి చెందిన ‘పచ్చ’ రంగును వేశారు. దీంతో పీఆర్ ఇంజినీర్లు ఎంబుక్‌ను రికార్డును చేస్తే తమకు ఎక్కడ నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటారోనని భయపడుతున్నారు. అయితే తాము భవనాలకు వేసిన పెయింట్‌కే బిల్లులను మంజూరు చేయాలని ఇంజినీర్లను కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు.


