● ఫోన్‌లో ఏపీఎంకు సింగిల్‌విండో చైర్మన్ హుకూం
● బుక్ కీపర్ నియామకంపై బెదిరింపులు
పగిడ్యాల: కూటమి పాలనలో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన ఏపీఎం కళావతికి ఉన్నట్టుండి 12.30 గంటలకు ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన ఏపీఎం కొద్ది సేపు సమాధానంగానే చెబుతూ వచ్చారు. అయితే ఒక్కసారిగా స్వరం మారిపోయి ‘పనిచేసే వాళ్లను ఎవ్వరినైనా తెచ్చుకోండన్న.. గ్రామ సంఘం తీర్మానం లేకుండా బుక్‌కీపర్‌ను నియమించలేం’.. అని గట్టి గట్టిగా మాట్లాడే సంభాషణలతో తోటి ఉద్యోగులు అవాకై ్క చూశారు. అయితే ఏపీఎంకు ఫోన్ చేసిన వ్యక్తి టీడీపీ నాయకుడు, సింగిల్‌విండో చైర్మన్ దామోదర్‌రెడ్డిగా తెలిసింది. మూడు నెలల క్రితం ఆంజనేయనగర్‌లోని అంజయ్య గ్రామ సంఘంలో బుక్ కీపర్ సమస్య ఉందని, గ్రామ టీడీపీ నాయకుడు విజయ్, దామోదర్‌రెడ్డి చెప్పిన వ్యక్తిని తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఏపీఎం తెలిపారు. వాళ్లు చెప్పిన వ్యక్తికి గ్రామ సంఘం తీర్మానం చేయడం లేదని, ప్రొసీజర్ ప్రకారం చేస్తామని చెబుతున్నా.. పనిచేస్తారా... పోతారా, ఎవ్వకిరి చెప్పాలో వారికి చెబుతామని బెదిరిస్తున్నారన్నారు.
నాగాభరణం, ముఖకవచం బహూకరణ
గడివేముల: దుర్గాభోగేశ్వరస్వామి, అమ్మవార్లకు భక్తులు సోమవారం నాగాభరణం, ముఖకవచం బహూకరించినట్లు ఈఓ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటిగలపాలెం గ్రామానికి చెందిన బొబ్బా బ్రహ్మారెడ్డి, బాలాకుమారి దంపతులు 1.223 కేజీల వెండి నాగాభరణం సమర్పించారు. అలాగే నంద్యాలకు చెందిన అట్రావణం రాజారావు, వసంతసుందరమ్మ దంపతులు రూ.1.30 లక్షలు విలువ చేసే వెండి ముఖకవచాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దాతలకు వేదాశీర్వచనం చేయించి స్వామి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసులు, అర్చకులు శ్యాంసుందర్‌శర్మ, గిరినాథశర్మ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మరణం
గోనెగండ్ల: బొలెరో వాహనం ఢీకొని ఎస్. లింగందిన్నె గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బోయ మదనగోపాల్(52) దుర్మరణం చెందాడు. పుట్టపాశం గ్రామ సమీపంలో ఈసంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఎస్. లింగందిన్నె గ్రామానికి చెందిన బోయ మదన గోపాల్ గత 12 ఏళ్లుగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం జరిగిన ఉపాధి పనులకు సంబంధించి మస్టర్లు తీసుకొని బిల్లు చేయించేందుకు గోనెగండ్ల ఎంపీడీఓ కార్యాలయానికి బైక్‌పై బయలు దేరాడు. ఎమ్మిగనూరు నుంచి బూత్‌పూర్‌కు కోడిగుడ్లతో వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం పుట్టపాశం గ్రామ సమీపంలో బైకును ఢీకొంది. ఈ ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఈరమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడు భార్యఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
శిరివెళ్ల: నంద్యాల– ఆళ్లగడ్డ జాతీయ దారిపై జరిగిన వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. వెంకటాపురానికి చెందిన తేనేల మధు (54) ఈ నెల 19వ తేదీ రాత్రి శిరివెళ్ల మెట్ట వద్ద చికెన్ కొనుగోలు చేసి తిరిగి స్వగ్రామానికి నడిచి వెళ్తూ గ్రామం వద్ద రోడ్డు దాటుతుండంగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇరువురు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్ తెలిపారు.
విధులకు వెళ్తూ..
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌గా పని చేస్తున్న ఎరుకలి వెంకటేశ్వర్లు (49) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అవుకు మండలం మిట్టపల్లికి చెందిన ఇతను ప్రస్తుతం నంద్యాల శ్రీనివాససెంటర్‌లో నివాసముంటున్నాడు. ఈ నెల 19వ తేదీ ఆదివారం కావడంతో ఇంటికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం బైక్‌పై విధులకు వెళ్తుండగా సోమవారం యర్రగుంట్ల ఉషోదయ పాఠశాల వద్ద మరో మోటార్ బైక్ ర్యాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇరువురు కుమారులు, ఇరువురు కుమార్తెలు. మృతుడి భార్య కళావతి ఫిర్యాదు మేరకు పోలీస్‌లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బంగారు షాపుపై మెరుపు దాడులు
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని మెయిన్ బజార్‌లోని ఓ బంగారు షాపుపై సోమవారం విజయవాడ నుంచి బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెడ్స్) వినియోగదారుల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక మహానంది జ్యువెలరీ షాపుపై వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో దాడులు చేశారు. పోలీసుల సమక్షంలో షాపుల్లోని నాలుగున్నర కేజీల హాల్‌మార్క్ గుర్తు లేని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని కోర్టుకు అందజేస్తామన్నారు. ఈ విషయం తెలియడంతో బంగారు షాపుల యజమానులందరూ అక్షయ తృతీయ పండుగ ఉన్నా కూడా షాపులు మూసివేశారు.


