బాలిక అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

నందవరం: మండల పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన బాలిక గుజ్జుల వైష్ణవి (13) అదృశ్యమైంది. బోయ గుజ్జుల వెంటేశ్వరి, బోయ గుజ్జుల వెంకటేష్‌ దంపతుల కుమార్తె అయిన ఈ బాలిక ఎమ్మిగనూరులోని బాలిక ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఈ నెల 18వ తేదీన ఎప్పటిలాగే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో పాఠశాలకు బయలు దేరింది. ఒంటి పూట బడులు కావడంతో మధ్యాహ్నం 3:00 గంటలకు తిరిగి రావాల్సిన అమ్మాయి రాలేదు. తల్లిదండ్రులు బాలిక స్నేహితులు, బంధువులను ఆరా తీయగా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు.

బావిలో వ్యక్తి గల్లంతు

నందికొట్కూరు: మిడుతూరు మండలంలోని చింతపల్లె గ్రామానికి చెందిన చాకలి గోవిందు(60) బావిలో ఈతకు వెళ్లి గల్లంతైనట్లు సోమవారం మిడుతూరు ఎస్‌ఐ ఓబులేసు తెలిపారు. వేసవి తాపానికి గ్రామ ప్రజలు చింతలపల్లె–దేవనూర్‌ గ్రామాల మధ్య ఉన్న వ్యవసాయ బావిలో సరదాగా ప్రతి రోజు ఈతకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చాకలి గోవిందు బావిలో దూకి బయటకు రాలేదు. గమనించిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య, కుమారులు బావి వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎస్‌ఐ ఓబులేసు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభించలేదు. భార్య తిరుపాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

వృద్ధురాలికి అరుదైన ఆపరేషన్‌

డోన్‌: స్థానిక వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో 80 ఏళ్ల వృద్ధురాలికి చేసిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హనీఫ్‌ తెలిపారు. వెల్దుర్తి మండలం మంగంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఆమె కుడివైపు తుంటి వద్ద ఫెమర్‌ మెడ విరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆమెకు ఫ్రాక్చర్‌ నెక్‌ ఆఫ్‌ ఫెమర్‌ శస్త్ర చికిత్సను ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా నిర్వహించారు. గత వారం జరిగిన శస్త్రచికిత్స అనంతరం ఆమె వేగంగా కోలుకుని నడుస్తున్నారని, సోమవారం ఆమె డిశ్చార్జ్‌ అయ్యారని డాక్టర్‌ హనీఫ్‌ వివరించారు.

వీఆర్వోలకు పదోన్నతి

ఉత్తర్వులు జారీ

కర్నూలు(సెంట్రల్‌): ఇటీవల రెవెన్యూ శాఖలో పని చేస్తున్న 150 మంది గ్రేడు–2 వీఆర్వోలకు గ్రేడు–1 వీఆర్వోలుగా పదోన్నతి కల్పించారు. అయితే, ఇంత వరకు వారికి వ్యక్తిగతంగా పదోన్నతి ఆర్డర్‌ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో డీఆర్వో టి.చిరంజీవి వారికి వ్యక్తిగత ఆర్డర్లతో పాటు కర్నూలు జిల్లాకు 83 మంది, నంద్యాల జిల్లాకు 67 మందిని కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వృద్ధురాలి మృతి

బండిఆత్మకూరు: ఓంకారం క్షేత్రంలో ఆదివారం అదృశ్యమైన మహిళ సోమవారం క్షేత్రానికి సమీపంలోని తెలుగుగంగ కాల్వలో శవమై కనిపించింది. ఎస్‌ఐ జగన్‌మోహన్‌ తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఖాదరబాద్‌కు చెందిన జింకల లక్ష్మీదేవి (63) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఓంకార క్షేత్రానికి ఆటోలో వచ్చారు. దర్శనం అనంతరం కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో భోజనం చేసిన తర్వాత లక్ష్మీదేవి బంధువుల నుంచి వేరయింది. ఈ క్రమంలో బంధువుల ఆచూకీ కోసం వెదుకుతూ తెలుగుగంగ ప్రధాన కాలువ వెంట వెళ్తూ ప్రమాదవ శాత్తూ కాలు జారి పడి మృతి చెందినట్లు తెలుస్తుందని ఎస్‌ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. మృతురాలి కూతురు అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేశామన్నారు. మృతురాలి శరీరంపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను కూతురికి అప్పజె ప్పామని ఎస్‌ఐ తెలిపారు.

జొన్నచొప్ప దగ్ధం

హొళగుంద: మండలంలోని మార్లమడికి గ్రామంలో కురువ సణ్ణణ్ణి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల జొన్నచొప్పకు సోమవారం ఆకస్మికంగా మంటలు చేలరేగి కాలిబూడిదైంది. స్థానిక ఎస్సీ కాలనీలో జొన్నచొప్పను వాముగా వేసుకున్నాడు. మధ్యాహ్న సమయంలో మంటలు అంటుకుని కాలిపోతుండగా స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించారు. అదుపులోకి రాకపోవడంతో ఆలూరు ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. వారొచ్చేలోగా దాదాపు చొప్ప కాలిపోయింది. మొత్తం రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement