● తీవ్రంగా గాయపడిన రైతు
సంజామల: రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వే ట్రాక్‌పై రెడ్డిపల్లె గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. సంజామల రైల్వే స్టేషన్ నుంచి కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి నూతనంగా రైల్వేట్రాక్‌ను ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి గూడ్స్ రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎం.రామచంద్రా రెడ్డి సోమవారం ఉదయం ట్రాక్టర్‌తో పొలానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన గూడ్స్ ఇంజిన్ సంజామల వైపు నుంచి వస్తోంది. అయితే గిద్దలూరు రస్తా వద్ద ట్రాక్ వద్ద మలుపు ఉండడంతో లొకో పైలెట్ ట్రాక్టర్‌ను గమనించకపోవడంతో ఢీకొంది. ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని రెడ్డిపల్లె ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో మూడు చోట్ల ట్రాక్‌ను దాటుకుని రైతులు పొలాలకు వెళ్లాల్సి వస్తుందని, వెంటనే గేట్‌మెన్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.


