● 21 తులాల బంగారు ఆభరణాలు,
రూ. 15 వేల నగదు చోరీ
ఎమ్మినగూరు రూరల్: పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లో ఆదివారం భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి దొంగలు 21 తులాల బంగారు ఆభరణాలు, రూ. 15 వేల నగదు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..శిల్పా ఎస్టేట్ కాలనీకి చెందిన శంకర్‌రెడ్డి, చరిత దంపతుల కుమార్తె వివాహం వచ్చే నెల 7,8 వ తేదీల్లో జరుగనుంది. శంకర్‌రెడ్డి, భార్య చరిత, కుమారుడు నర్సిరెడ్డి ఆదివారం ఉదయం బళ్లారిలోని బంధువులకు పెళ్లి కార్డుల ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడ కార్డులు పంచి అనంతపురానికి వెళ్లారు. రాత్రి కావడంతో అక్కడ బంధువుల ఇంట్లో ఉన్నారు. సోమవారం ఉదయం శంకర్‌రెడ్డి ఇంటికి పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తలుపులు కట్‌చేసి ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె ఇంటి యజమానికి చేరవేసింది. వెనువెంటనే శంకర్‌రెడ్డి బంధువుల ద్వారా పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. టౌన్ సీఐ వి. శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. 12.30 గంటల ప్రాంతాంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. ఇంటి తలుపులకు, బీరువాకు ఉన్న వేలిముద్రలను సేకరించారు. బీరువాలో ఉంచిన 2 తులాల నెక్లెస్, 5 తులాల 6 గాజులు, 32 గ్రాముల కంకణం, 4 జతల కమ్మలు, 1 జత బుట్టలు, 2 ఉంగరాలు, రూ. 15 వేల నగదు చోరీ అయినట్లు శంకర్‌రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో దొంగతనం జరగటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు.


