● రెండు నాటు తుపాకులు స్వాధీనం
రుద్రవరం: నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను వేటాడుతున్న ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేసినట్లు రుద్రవరం రేంజ్ అధికారి ముర్తుజావలి తెలిపారు. అహోబిలం నార్త్ బీట్ పెద్దసెల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట సాగుతున్నట్లు సమాచారం రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం చెంచులు వన్య ప్రాణులను వేటాడేందుకు వెళ్లినట్లు సమాచారం అందడంతో సిబ్బందితో దాడులు చేశారు. ఆ దాడిలో అహోబిలానికి చెందిన సిసింద్రితో పాటు మరో ఇద్దరు మైనర్లు పట్టుబడ్డారు. వారి నుంచి రెండు నాటుతుపాకులు, మందుగుండు సామగ్రి, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ తెలి పారు. మరో ఇద్దరు నిందితులు పరారైనట్లు ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా మెజిస్ట్రేట్ రిమాండుకు ఆదేశించారన్నారు.


