గల్ఫ్ దేశాలకు నిలిచిపోయిన ఉల్లి ఎగుమతులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి ప్రధాన వాణిజ్య పంట. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏటా లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. ఇలాంటి పంటకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఉల్లి ఎగుమతులు నిలిచిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లిలో 50 శాతం బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతుంది. అయితే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేయడం ఉల్లి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మద్దతు ఇస్తోంది. అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు ఉల్లి ఎగుమతులను ప్రోత్సహించే విధంగా చొరవ తీసుకోవాల్సిన చంద్రబాబు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలోని ఉల్లిలో 80 శాతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే పండుతుంది. 2025 ఖరీఫ్‌లో పండించిన ఉల్లికి ధర పడిపోయినప్పుడు ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించినప్పటికీ రైతులకు పెట్టుబడి కూడా దక్కలేదు. రబీలో ఉల్లి సాగు చేసిన రైతులు 100 శాతం మంది నష్టాలు భరించారు. ఉల్లి సాగు చేసి లాభపడిన రైతు ఒక్కరంటే ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
కలసిరాని మహారాష్ట్ర రకాలు సాగు
మహారాష్ట్రలోని పుణే, నాసిక్ తదితర ప్రాంతాల్లో పండించిన ఉల్లిలో నాణ్యత ఎక్కువగా ఉంటోంది. నిల్వ కూడా ఎక్కువ రోజులు సాధ్యం. మహారాష్ట్ర రకాలతో జిల్లాలో ఉల్లి సాగు చేయించాలని కొన్నేళ్ల క్రితమే కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్‌ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర విత్తన రకాలతో ఉల్లి సాగు చేయిస్తున్నప్పటికీ కలసిరాని పరిస్థితి నెలకొంది. అక్కడి నేలలకు, ఇక్కడి నేలలకు తేడా ఉండటంతో సాగులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో లోకల్ రకాలైన బళ్లారి రెడ్, పూనా రెడ్ వంటి రకాలతో నెట్టుకొస్తున్నారు.
ఉల్లి ధర దయనీయం
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, బంగ్లాదేశ్‌కు ఎగుమతులు నిలిచిపోవడం తదితర కారణాలతో ఉల్లికి డిమాండ్ పడిపోయింది. కేంద్రంతో చర్చించి బంగ్లాదేశ్‌కు ఎగుమతులను ప్రోత్సహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉల్లికి అన్‌సీజన్. ఈ సమయంలో ఉల్లి ధరల్లో కొంతమేర పెరుగుదల ఉండాలి. కానీ ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ఉల్లికి డిమాండ్ లేకుండా పోయింది. రాష్ట్రంలోనే ఉల్లి మార్కెటింగ్‌కు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధారం. ఇక్కడే ఉల్లి ధర దయనీయంగా ఉంటోంది. గరిష్ట ధర రూ.841 మాత్రం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధర కూడా ఒకటి, రెండు లాట్లకు మాత్రమే లభించింది. ఎక్కువ లాట్లకు రూ.500 కూడా మించని పరిస్థితి.
2025–26 రబీలో ఒకటిన్నర ఎకరాలో ఉల్లి సాగు చేశాం. రూ.1.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ధరనే పూర్తిగా నిరాశకు గురి చేసింది.క్వింటాలుకు కనీసం రూ.1200 ధర లభిస్తే గిట్టుబాటు అవుతుంది. అయితే క్వింటాలుకు లభించిన ధర రూ.480 మాత్రమే. ఈ ధరతో అమ్ముకోవడం వల్ల రూ.లక్ష మాత్రమే వచ్చింది. పెట్టుబడితో పోలిస్తే రూ.30 వేలు నష్టం వచ్చింది. ఎగుమతులు లేకపోవడం వల్ల ఉల్లి ధరలు పడిపోయాయి. బంగ్లాదేశ్‌కు ఎగుమతులు ఉన్నప్పుడు క్వింటాలుకు కనీసం రూ.1200 నుంచి రూ.1500 వరకు ధర లభించేది. ఎగుమతులు లేకపోవడంతో క్వింటాలుకు రూ.500 కూడా లభించడం లేదు. – రామానాయుడు,
పులకుర్తి, కోడుమూరు మండలం
సోలార్ డ్రైయ్యర్లను విస్మరించిన సర్కారు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసిన ఉల్లి రైతులను ఆదుకోవాలనే ప్రధాన లక్ష్యంతో సోలార్ డ్రైయర్లను ప్రోత్సహించింది.
వీటి వల్ల రైతులు పండించిన ఉల్లికి డిమాండ్ ఏర్పడటంతో పాటు పొదుపు మహిళలకు ఉపాధి లభించింది.
ఉల్లి రైతులను ఆదుకోవాలనే ఏకై క లక్ష్యంతో వందలాది సోలార్ డ్రైయర్లను అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుతం అధికారంలోని చంద్రబాబు ప్రభుత్వం సోలార్ డ్రైయర్లను పూర్తిగా పక్కన పెట్టింది.
నేడు జిల్లాలో ఒక్క సోలార్ డ్రైయర్ కూడా కనిపించని పరిస్థితి.
బంగ్లాదేశ్‌కు ఎగుమతులను
నిలిపేసిన కేంద్రం
మోదీని ఒప్పించడంలో
చొరవ చూపని టీడీపీ ప్రభుత్వం
ధర పతనమై రైతులకు నష్టాలు
మద్దతు ఇవ్వకపోగా
సాగు వద్దంటున్న చంద్రబాబు
గత ప్రభుత్వం
సోలార్ డ్రైయర్లతో ప్రోత్సాహం
వీటిని పక్కన పెట్టిన ప్రస్తుత సర్కారు
సరిగ్గా 10 నెలల క్రితం ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. సాగులో ఇబ్బందులు, విస్తీర్ణాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్త ఉల్లి రకాలను రైతులకు అందుబాటులోకి తేవడం తదితర అంశాలపై కేంద్ర బృందం రైతులతో చర్చించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఉల్లి సాగు వద్దంటోంది. రాయలసీమ జిల్లాలను ఉద్యాన పంటల హబ్‌గా అభివృద్ధి చేస్తామంటున్న చంద్రబాబు సర్కార్ ఉల్లి సాగు చేయకుండా చూడాలని, ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని ఉద్యాన శాఖను ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో ఏడాది పొడవునా లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. దీనిని 50 శాతానికిపైగా తగ్గించాలని ఉద్యాన శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉల్లి పంటకు మద్దతు కల్పించడంలో చేతులెత్తేసిన సర్కార్ ఏకంగా సాగును లేకుండా చేయాలనుకోవడం గమనార్హం.


