● చిప్పగిరిలో 43.9, ఆళ్లగడ్డలో 43.6
డిగ్రీల ఉష్ణోగ్రత
కర్నూలు(అర్బన్): ప్రస్తుత వేసవిలో ఎండ, వడగాలులతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు. మరో వైపు ద్రోణి ప్రభావంతో మంగళవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ర్యాగింగ్‌పై ఫిర్యాదు రాలేదు
● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ జరిగినట్లు మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో ర్యాగింగ్ అంశంపై కేఎంసీ విద్యార్థుల నుంచి ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేసిన విషయమై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందన్నారు. ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేసినట్లు ఎవరూ తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. హాస్టల్‌లో ఫస్టియర్ విద్యార్థులను, సీనియర్ విద్యార్థులకు వేర్వేరు బిల్డింగుల్లో ఉంచుతామన్నారు. రాత్రి 9 గంటల తర్వాత ఫస్టియర్ విద్యార్థులు ఉండే భవనంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదన్నారు. సీనియర్ల నుంచి జూనియర్లకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ర్యాగింగ్ చేస్తే ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
9 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు
కర్నూలు(సెంట్రల్): కారుణ్య నియామకం కింద రెవెన్యూ శాఖలో 9 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఒకరు జూనియర్ అసిస్టెంట్ కాగా, 8 మంది ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలు పొందారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఉద్యోగాలకు ఎంపికై న వారికి నియామక పత్రాలను అందజేసి సక్రమంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో చిరంజీవి పాల్గొన్నారు.
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. సోమవారం నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 8,395 మందికి గాను 7,570 మంది విద్యార్థులు హాజరు కాగా 819 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. డోన్ జీవీఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు సెయింట్ జోసప్స్ కళాశాల, ఉస్మానియా కళాశాల, నంద్యాల పీఎస్‌సీ అండ్ కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడటంతో డిబార్ చేసినట్లు తెలిపారు.
ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 115 ఫిర్యాదులు
కర్నూలు: కర్నూలు కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 115 ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా భూ వివాదం, బంధువుల నుంచి వేధింపులు, ఉద్యోగాల పేరుతో మోసం, ఇంటి స్థలాల ఆక్రమణ, అధిక వడ్డీ పేరుతో మోసం, రోడ్డు ప్రమాదాలతో పాటు వ్యక్తిగత సమస్యలపై బాధితులు ఎస్పీకి విన్నవించుకున్నారు. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామకృష్ణ, రామయ్య నాయుడు తదితరులు పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.


