● ఇద్దరికి తీవ్రగాయాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల మజరా గ్రామమైన పైబోగులలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లపై టీడీపీ వర్గీయులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. గ్రామానికి చెందిన రమణయ్య, రాజులు పొలం పనులతో జీవనం సాగిస్తున్నారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ నిర్మాణానికి పొలాలను తీసుకున్నారు. పొలాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం రాకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. నష్టపరిహారం అడిగినందుకు దాడులకు తెగబడుతున్నారు. రమణయ్య, రాజు గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వీరిద్దరూ సోమవారం ఉదయం పొలానికి ఎద్దుల బండిపై వెళ్తుతుండగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రాజు కాలికి తీవ్రగాయం కావడంతో రక్తస్రావమైంది. స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను వైస్ ఎంపీపీ కాలునాయక్, వైఎస్సార్‌సీపీ నాయకులు రవీంద్రారెడ్డి, మేఘనాధరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు, నాయకులపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. పైబోగుల గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడులు చేయడం హేమమైన చర్య. గ్రామానికి చెందిన రాజు, రమణయ్య కుటుంబాలకు అండగా ఉంటాం. దాడులకు పాల్పడిన టీడీపీ వర్గీయులపై పోలీసులు నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు


