● నలుగురు అరెస్ట్,
రూ.22 లక్షల నగదు స్వాధీనం
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసి, భారీగా నగదు, విలువైన సెల్ ఫోన్లు సీజ్ చేశారు. డీఎస్పీ ముర్రవాడ భార్గవి సోమవారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్ అవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డెక్కన్ 247 పేరుతో ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను క్రియేట్ చేసి ఎమ్మిగనూరు పట్టణ పరిసరాల్లో ఆరుగురు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో డీఎస్పీ పర్యవేక్షణలో పట్టణ సీఐ వి. శ్రీనివాసులు, ఎస్‌ఐ మధుసుధన్‌రెడ్డి, క్రైంపార్టీ పోలీసులు దాడి చేశారు. బెట్టింగ్ ముఠాకు చెందిన ఆరుగురిలో పట్టణానికి చెందిన మహమ్మద్‌షాషావలి, షరీఫ్, రంగాచారి, పెద్దతుంబళానికి చెందిన పవన్‌కుమార్‌ను అరెస్టు చేసి వారి నుంచి రూ. 22 లక్షల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదోనికి చెందిన శివమూర్తి, సిరుగుప్పకు చెందిన పీరా పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. డబ్బు ఆశతో యువత బెట్టింగ్ ఉచ్చులోపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ జరగుతున్నట్లు తెలిస్తే వెంటనే 112 నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.


