శ్రీశైలంటెంపుల్: వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా మంగళవారం ఆదిశంకరాచార్యుల జయంతి నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9 గంటలకు పాలధార–పంచధార ఉన్న శంకర మందిరంలో ప్రత్యేక పూజలు చేపడుతామన్నారు. శంకరులు శ్రీశైలంలోని పాలధార–పంచధార వద్ద కొంతసేపు తపస్సు చేసి ఇక్కడే శివానందలహరి గ్రంథాన్ని రచించారని తెలిపారు.
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
21న కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు సిటీ: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఈనెల 21న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.వి కృష్ణారెడ్డి తెలిపారు. కర్నూలులోని పీఆర్‌టీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కామన్ సీనియారిటీతో ఉపాధ్యాయల పదోన్నతులు జరపాలన్నారు. తక్షణమే పీఆర్‌సీ కమిషన్‌ను ప్రకటించి, మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, ఇన్‌సర్వీస్ టీచర్స్‌కు టెట్ పరీక్ష రద్దు చేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి ప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా భాస్కర్‌నాయుడు
● నంద్యాల అధికారిగా కే లలితాబాయి
కర్నూలు(అర్బన్): జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారిగా (డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా) టీవీ భాస్కర్‌నాయుడు నియమితులయ్యారు. నంద్యాల జిల్లా డ్వామాలో ఎంఅండ్‌ఈగా విధులు నిర్వహిస్తున్న ఈయనను కర్నూలు డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమితులైన భాస్కర్‌నాయుడు గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంపీడీఓగా, జిల్లా పరిషత్ ఏఓ, డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా ఆయనను ప్రభుత్వం ఇక్కడకు నియమించింది. అలాగే నంద్యాలలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే లలితాబాయిని నంద్యాల డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది డిప్యూటీ సీఈఓ, డీడీఓలకు పదోన్నతులు కల్పిస్తూ వేర్వేరు జిల్లాలకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు జిల్లా అధికారులుగా నియమించారు.
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిల క్షేత్రంలో కారధ్య నరసింహస్వామి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భద్రత సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. ఆదివారం గేటు వద్ద ఉన్న షెల్టర్‌ను ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారంతా భయాందోళనకు గురయ్యారు. సీసీ కెమెరాలతో పాటు నిఘా వ్యవస్థ పూర్తిగా కాలి బూడిదైంది.


