ఎమ్మిగనూరు టౌన్: అధికారంలో ఉన్నాం కదా తాము అనుకుంటే ఏదైనా చేస్తాం అని టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు. అమాయకులైన రైతుల నుంచి గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు దాదాపు రూ.35 లక్షల వరకు వసూలు చేశారు. వసూలు చేసిన డబ్బును ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పేరుగాంచిన వ్యక్తికి ఇప్పటికే ముట్టజెప్పినట్లు తెలిసింది. సదరు వ్యక్తి హామీ ఇవ్వడంతో టీడీపీ నేతలతో కలసి కొందరు తమ పొలాల నుంచి జీడీపీ (గాజులదిన్నె ప్రాజెక్ట్ ) కుడికాలువ గట్టువరకు భూములను తవ్వి పైపులు వేశారు. ఇక కాలువ గట్టు తవ్వి కాలువలో పైపులు వేసుకొవాల్సి ఉంది. ఆ తరువాత కాలువ నీటిని అక్రమ సాగుకు మళ్లించు కోవచ్చు. ఈవిషయం తెలిసిన జీడీపీ అధికారులు వారి వద్దకు వెళ్లి కాలువకు పైపులు వేసి మళ్లిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే టీడీపీ నేతలు పైపులు మాత్రమే వేసుకుంటున్నామని బుకాయించారు.
పైపులను తొలగించాలి
ఏటా నిల్వ ఉంటే ఉన్న నీటితోనే ఆయకట్టు రైతులు పంటలు పండించుకునే వారు. అయితే జేసీబీతో ఏకంగా భూమిని తవ్వి పదుల సంఖ్యలో పైపులు వేసుకొని అక్రమ సాగుకు మళ్లించుకోనేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. అక్రమ సాగుకు మళ్లించేందుకు వేసుకొన్న పైపులను తొలగించాలని, కాలువ గట్లను తవ్వి పైపులు వేసుకొంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈమేరకు రైతులు కోడుమూరులో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.
కుడి కాలువ కింద ఒంటెడుదిన్నె గ్రామ సమీపంలో పైపులు వేసుకొంటున్నారని తెలిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించాం. వారికి హెచ్చరికలు జారీ చేశాం. వారు కాలువకు పైపులు వేస్తే కఠిన చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేస్తాం.
– మహమ్మద్ ఆలీ, జీడీపీ ఏఈ
టీడీపీ నేతల బరితెగింపు
రైతుల నుంచి రూ.35 లక్షల వసూలు
జీడీపీ కుడి కాలువ నుంచి అక్రమంగా
నీరు పారించుకొనేందుకు పన్నాగం
ముందస్తుగా పైపుల ఏర్పాటు
అక్రమ సాగు కోసమే..
జీడీపీ కింద స్థిరీకరించిన ఆయకట్టు 24,372 ఎకరాలు మా6తమే. ఏటా రబీలో కేవలం 13 వేల ఎకరాల్లోపే సాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇందులో కుడి కాలువ కింద 20,790 ఎకరాలకుపైగా సాగునీరు ఇవ్వాల్సి ఉంది. అయితే 11వేల ఎకరాలకు మించి సాగునీరందడం లేదు. అదేవిధంగా ఎడమ కాలువ కింద 3,582 ఎకరాలకు నీరు ఇవ్వాల్సివుండగా 1,500 ఎకరాలకు మించడం లేదు. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వాల్సిన టీడీపీ నేతలు అక్రమ సాగుకు నీరు పారించుకొనేందుకు పైప్‌లైన్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని కుడి కాలువ ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


