ఓర్వకల్లు: ప్రమాదవశాత్తూ అరటి తోటకు నిప్పంటుకొని కాలిపోయింది. ఈ ఘటన బాధిత రైతుకు రూ. 80 వేలు నష్టాన్ని మిగిల్చిది. మండలంలోని పాలకొలను గ్రామంలో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత రైతు న్యామతుల్ల తెలిపిన వివరాల మేరకు.. న్యామతుల్ల ఊరిలో పండ్లతోటలను కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి అనే రైతుకు సంబంధించిన 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మూడేళ్ల క్రితం అరటి మొక్కలను నాటుకున్నాడు. ఇప్పటికే రెండు కోతలు కోయగా, మరో రెండు మాసాలలో పంటకోత వచ్చేదశకు చేరుకుంది. శనివారం పక్కపొలంలోని రైతు పొలం గట్టుపై ఉన్న గడ్డిని కాలుస్తుండగా మంటలు ఎగిసి అరటి తోటకు వ్యాపించాయి. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న న్యామతుల్లా పొలానికి వెళ్లి చూడగా అర ఎకరా విస్తీర్ణంలోని సుమారు 300 అరటి మొక్కలు, డ్రిప్ పరికరాలు కాలిపోయి ఉన్నాయి. వెంటనే పొలంలోని విద్యుత్ మోటర్‌ను ఆన్‌చేసి, డ్రిప్ పైపుల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.80 వేలు ఆస్తినష్టం వాటిల్లినట్లు కౌలు రైతు గగ్గోలు పెట్టారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు.


