ఉయ్యాలవాడ: మండలంలోని హరివరం గ్రామానికి చెందిన వివాహిత మెట్టుపల్లె లక్ష్మి (30) అదృశ్యమైంది. ఈ మేరకు ఉయ్యాలవాడ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మెట్టుపల్లె లక్ష్మి ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్య ఆచూకీ కోసం భర్త దస్తగిరి తన బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో గాలించారు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెట్టుపల్లె లక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బైక్ దొంగల అరెస్ట్
ఆదోని రూరల్: ఇటీవల ఇస్వీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడిన ఇద్దరిని పట్టుకున్నట్లు ఇస్వీ ఎస్‌ఐ మహేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిందితుల వివరాలను ఎస్‌ఐ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణంలోని ఎంజీ సర్కిల్ వద్ద నివాసముంటున్న మాదిగ మనోజ్‌కుమార్, కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసనూరు గ్రామానికి చెందిన మాదిగ రాముడు అలియాస్ చరణ్ ఇటీవల ఇస్వీ గ్రామంలో రెండు మోటార్ సైకిళ్లను దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. పక్కా సమాచారం మేరకు దొంగలను పట్టుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది సుదర్శన్, బీరప్ప, వెంకటేష్, కిరణ్‌కుమార్, రామచంద్ర, హెడ్‌కానిస్టేబుల్ నాగరాజు పాల్గొన్నారు.
కాలువలో పడి విద్యార్థిని మృతి
కౌతాళం: మండల పరిధిలోని కామవరం గ్రామంలో శనివారం తప్పిపోయిన బాలిక కాలువలో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నర్సమ్మను మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామానికి చెందిన నరసింహులకు ఇచ్చి పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు సంతానం ఉన్నారు. మొదటి సంతానం రక్షిత (7) చిరుతపల్లి గ్రామంలో 1వ తరగతి చదువుతున్నది. రెండు రోజుల క్రితం తల్లి నర్సమ్మతో కలిసి కామవరం గ్రామానికి వచ్చింది. శనివారం మధ్యహ్నం ఇంటి నుంచి ఆడుకునేందుకు బయటకు వెళ్లి స్థానికంగా ఉన్న ఎల్‌ఎల్‌సీ కాలువలో పడిపోయింది. ఎంతసేపైన బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బందువులు బాలిక కోసం గాలించిన ఫలితం లేకపోయింది. ఆదివారం సాయంత్రం కాలువలో బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో బాలిక కాలువలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పిడుగుపాటుతో రెండు ఎద్దులు మృతి
సి.బెళగల్: మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో పిడుగుపాటుతో రెండు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఉప్పరి బసన్నకు చెందిన దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే రెండు ఎద్దులను ఎప్పటిలాగానే ఆదివారం గ్రామంలోని పశువుల దొడ్డిలో కట్టేసుకున్నాడు. అయితే ఆదివారం సాయంకాలంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో కంబదహాల్ గ్రామంలో వర్షంలో భారీ శబ్దంతో పిడుగు పడటంతో దొడ్లో కట్టేసుకున్న రెండు ఎద్దులు అక్కడికి అక్కడే మృతి చెందాయి. సంఘటనను గమనించిన స్థానిక రైతులు బాధిత రైతుకు విషయం తెలియజేశారు.
బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
మంత్రాలయం రూరల్: బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని, మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మిగనూరు డీఎస్సీ భార్గవి అన్నారు. ఆదివార చిలకలడోణ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బాలికలు, మహిళల భద్రతకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గురువారం చిలకలడోణ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం అన్నారు. ఇకపై ప్రమాదాలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వారి భద్రత కోసం 100, 112, 1930 హెల్ప్‌లైన్ నంబర్లకు గాని, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని సూచించారు. సీఐ ఎం దస్తగిరి బాబు, ఎస్‌ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


