జల్సాల కోసం చోరీలు | - | Sakshi
Sakshi News home page

జల్సాల కోసం చోరీలు

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

16 తులాల బంగారు, 60 తులాల

వెండి ఆభరణాలు స్వాధీనం

ఎమ్మిగనూరురూరల్‌: జులాయిగా తిరుగుతూ జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న బావ, బావమర్దిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఎమ్మిగనూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 16 తులాల బంగారు, 65 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక డీఎస్సీ కార్యాలయంలో డీఎస్పీ భార్గవి విలేకరుల సమావేశంలో దొంగల వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరుగుప్ప టౌన్‌కు చెందిన శ్రీకాంత్‌, బళ్లారి జిల్లా సింధనూరు టౌన్‌కు చెందిన ఏజే పవన్‌కళ్యాణ్‌ బావబామర్దులు. ఇద్దరు జులాయిగా తిరిగేవారు. జల్సాల కోసం చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవారు. అప్పులు చేసి పేకాటాడేవారు. అయితే అప్పులు చెల్లించేందుకు పెద్ద దొంగతనాలు చేశారు. గతేడాది జూలై 20వ తేదీ అర్ధరాత్రి పెద్దకడుబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలో బుడిజగ్గుల ఈరన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అలాగే ఈ ఏడాది జనవరి 12వ తేదీన ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో పెద్దనర్సిరెడ్డి ఇంట్లో, మార్చి 28వ తేదీన పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన మోకాసి వీరేష్‌ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. దొంగలించిన బంగారు ఆభరణాల్లో కొంత సింధనూరులో ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో ఎంజాయ్‌ చేశారు. మిగిలిన బంగారు ఆభరణాలను కర్నూలులో విక్రయించేందుకు పల్సర్‌ బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో మహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కాలేజీ దగ్గర పెద్దకడుబూరు పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారు, 65 తులాల వెండి ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భార్గవి తెలి పారు. రికవరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను బాధితులకు కోర్టు ద్వారా అప్పగిస్తామన్నారు. కేసును ఛేదించిన కోసిగి సీఐ మంజునాథ్‌, పెద్దకడుబూరు ఎస్‌ఐ మారుతి, పోలీస్‌లను డీఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement