● ఎన్‌డీఏలో 46వ ర్యాంకర్‌గా
పీఎం కోవిధ్‌రెడ్డి
కర్నూలు(అర్బన్): నేవీలోకి వెళ్లాలనేది ఆ విద్యార్థి కల. 9వ తరగతి నుంచే ఎంతో కష్టపడ్డాడు. కఠోర సాధన, పుస్తక పఠనం, అనుభవజ్ఞుల నుంచి మెలకువలు నేర్చుకొని తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. కర్నూలు ధర్మపేటలో నివాసం ఉంటున్న జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీరు పీఎం విశ్వనాథరెడ్డి, మాధవీ దంపతుల తనయుడు పీఎం కోవిధ్‌రెడ్డి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు సాధించి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు.
దిశ మార్చిన కోవిడ్ ...
1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కర్నూలులోని సెయింట్ జోసప్ స్కూల్‌లో చదువుతున్న కోవిధ్‌రెడ్డి కోవిడ్ సమయంలో స్కూల్స్ మూతపడగా, ఇంటి వద్ద ఉంటూ చుదువుకుంటున్నాడు. ఆ సమయంలోనే కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు వచ్చిన ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నాడు, రెండు నెలల కోచింగ్ తీసుకున్న అనంతరం విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ప్రవేశం పొందాడు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ( 12 గ్రేడ్ ) వరకు అక్కడే విద్యను అభ్యసిస్తునే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 12 గ్రేడ్ పాస్ అయిన వారికి ఎన్‌డీఏలో ప్రవేశం పొందేందుకు యూపీఎస్‌సీ ప్రతి ఏడాది రెండు సార్లు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. లక్షల సంఖ్యలో విద్యార్థులు రాసిన అత్యధిక పోటీ ఉండే ఈ పరీక్షలో కోవిధ్‌రెడ్డి 46వ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది జూలై నెలలో ఇండియన్ నేవీలో శిక్షణకు వెళ్తున్నాడు.
గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన పరీక్షకు లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో మంచి మార్కులను సాధించాను. మ్యాథమేటిక్స్, జనరల్ ఎబిలిటీ, ఇంగ్లిషు, జనరల్ నాలెడ్జ్‌లో పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో కనీసం 25 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సర్వీస్ సెలెక్షన్ బోర్డు ( ఎస్‌ఎస్‌బీ ) ఇంటర్వ్యూను కూడా నిర్వహించింది. ఇంటర్వ్యూలో కూడా మంచి మార్కులు సాధించాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల శిక్షణతో జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది.


