● భార్యే చంపించిందని హతుడి కుటుంబీకుల ఆరోపణ
బొమ్మలసత్రం: బామ్మర్దుల చేతిలో బావ హతమైన ఘటన నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. హతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బండిఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కరీముల్లా (26) పాలిష్ కట్టర్‌గా పనిచేస్తున్నాడు. కరిముల్లా నంద్యాల పట్టణం చాంద్‌బాడా వీధికి చెందిన కరిష్మాను ఇష్టపడి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో తరచూ గొడవలు జరిగేవి. కరిష్మాకు ఇదివరకే వివాహం జరిగి కరిముల్లాను రెండో వివాహం చేసుకున్నారు. అయితే తాను మొదటి భర్తతో కాపురం చేస్తానని చెప్పడంతో గొడవ మొదలైనట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకూ ఇంట్లో ఉన్న కరీముల్లాను కొందరు ఇంటి వద్దకు వచ్చి నంద్యాలలో ఉన్న కరిష్మా రమ్మని చెప్పిందని వెంటతీసుకుని వెళ్లారు. ఉదయం కొత్తపల్లి నుంచి భీమవరం వేళ్లే రహదారిలో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కరీముల్లాను మొదటి భర్త కోసం భార్య తన సోదరులు అల్తాఫ్, రహమాన్‌లతో హత్య చేయించిందని ఆరోపించారు. కరీముల్లా శరీరంపై కత్తితో పొడిచి పేగులు బైటికి లాగారాని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తాలూకా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గుండెపోటుతో ఏఎస్‌ఐ మృతి
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): శ్రీశైలంలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న మంప గ్రామానికి చెందిన వంజరి కొండబాబు (45) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. శ్రీశైలంలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న కొండబాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం పాయకరావుపేటలో చదువుకుంటున్న తన కుమారుడిని పరామర్శించి, స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


