గంజిహళ్లి గ్రామం చెరువులో అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలోని చెరువులో తవ్వకాలను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. గ్రామ పరిధిలో వున్న చెరువులో మట్టిని తమ భూ ములకు తరలించుకునేందుకు గ్రామ రైతుల హక్కు ఉందన్నారు. అయితే అదే మట్టిని ఇటుకల తయారీ తరలించుకునేందుకు వ్యాపారులకు మాత్రం అనుమతులివ్వడం వెనుక మతలబమేమిటని ప్రశ్నించారు. గ్రామ రైతులకు ఒక న్యాయం, ఇటుకల వ్యాపారులకు ఒక న్యాయమా.. అంటూ మండిపడ్డారు. 40 నుంచి 50 టిప్పర్లు పెట్టి చెరువ మట్టిని తరలించడంతో శనివారం గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నా.. అధికారుల అండతో మళ్లీ తరలిస్తున్నారన్నారు. చెరువు కట్టకు వంద మీటర్ల లోపే పూడిక తవ్వుకునేందుకు నిబంధన వుందని దీనిపై అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామస్తులు చెరువు మట్టి తవ్వకాలపై ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మట్టి తవ్వకాలు నిలిపివేయకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన వెంట సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు గంజిహళ్లి తిరుమల్‌రెడ్డి, మల్లేష్, గ్రామ మాజీ సర్పంచ్ రాముడు, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రామ మాజీ ఎంపీటీసీ గంజిలయ్య, కోటేకల్ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మన్న, మహేశ్వర్‌రెడ్డి, కడివెళ్ల బాష, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.


