కోసిగి: ఎండాకాలంలో మంచినీరు దొరకక కడదొడ్డి గ్రామస్తులు దాహంతో అల్లాడుతున్నారు. గ్రామం 2009లో వరద ముంపు కావడంలో 1.5 కిలో మీటర్ దూరంలో సురక్షిత ప్రాంతంలో కొత్త గ్రామం ఏర్పాటు చేశారు. కొందరు కొత్త గ్రామంలో నివాసాలు ఏర్పాటు చేసుకోగా, మరికొందరు పాతం గ్రామం వదిలి రాక అక్కడ నివాసం ఉంటున్నారు. రెండు గ్రామాలకు కలిసి కొత్త గ్రామంలో ఒక తాగునీటి బోరు ఏర్పాటు చేశారు. ఆ గ్రామం నుంచి పాత గ్రామానికి పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. గతంలో నది నుంచి తాగునీరు సరఫరా అయ్యేది. కొద్ది కాలంగా నది నీరు సరఫరా బంద్ అయ్యింది. కేవలం ఒక బోరు నుంచి మాత్రమే నీరు సరఫరా అవుతోంది. కొత్త గ్రామం నుంచి వచ్చే పైప్‌లైన్ లీకేజ్ కావడంతో పాత గ్రామానికి నీళ్లు అరకొరగా వస్తున్నాయి. నీటి కోసం ట్యాంక్ వద్ద బిందెలు వరుస క్రమం పెట్టి గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


