సత్వర న్యాయం కోసమే నూతన కోర్టులు | - | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయం కోసమే నూతన కోర్టులు

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

కర్నూలు: పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించే ఉద్దేశంతోనే నూతన న్యాయస్థానాలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు జడ్జి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ అన్నారు. శనివారం సాయంత్రం కర్నూలులో కొత్తగా ఏర్పాటు చేసిన 5వ, 6వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులను తన సహచర న్యాయమూర్తులు జస్టిస్‌ కె.శ్రీనివాస రెడ్డి, జస్టిస్‌ ఎ.హరిహరనాథ శర్మలతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త కోర్టుల ప్రారంభం యువ న్యాయవాదులకు మంచి అవకాశం అన్నారు. ప్రతి జూనియర్‌ న్యాయవాది సీనియర్‌ న్యాయవాదుల అనుభవాలను తెలుసుకుని వృత్తిలో రాణించాలన్నారు. జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కర్నూలుతో తనకున్న అనుబంధం వల్లే ఇతర పనులున్నా నూతన కోర్టుల ప్రారంభానికి వచ్చానన్నారు. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదని, కష్టే ఫలి అని భావించి కష్టపడటం అలవాటు చేసుకుని ఉన్నత స్థితికి చేరాలన్నారు. జస్టిస్‌ ఎ.హరిహరనాథ శర్మ మాట్లాడుతూ న్యాయవాదులు తమ ప్రతిభతో పాటు విలువలను అలవర్చుకుని భవిష్యత్తు తరాలకు మంచి నడవడిక, పురోభివృద్ధికి నాంది పలకాలన్నారు. తన న్యాయవాద వృత్తిలో కర్నూలు న్యాయవాదుల సహాయ సహకారాలను మరువలేనన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన కోర్టులలో కొన్ని మాత్రమే ప్రస్తుతం ప్రారంభిస్తున్నామని, అతి త్వరలో మంజూరైన అన్ని కోర్టులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి టి.మహేశ్వర్‌ రెడ్డి, జిల్లాలోని అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్‌ సివిల్‌ జడ్జిలు, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, జీపీ, ఏజీపీ, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం పాత చట్టాల స్థానంలో నూతన చట్టాలు అమలు జరుగుతున్న తరుణంలో జిల్లాలోని న్యాయమూర్తులకు శనివారం జిల్లా కోర్టు హాల్‌లో కార్యశాల నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement