కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రేషన్‌కార్డు కలిగిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ కె.పుష్పక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఈ నెల 20 నుంచి మే 4వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భో జనం, వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. వివరాలకు 9000710508, 9666224931, 9440905477, 08518– 273710 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఎమ్మిగనూరుటౌన్/గోనెగండ్ల: గడువు తీరినా టిప్పర్లతో చెరువులో మట్టి తరలింపు చేయడాన్ని ప్రజలు అడ్డుకున్నారు. టీడీపీ నాయకుల అండదండలతో ప్రజాధనాన్ని లూటీ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సర్దిచెప్పినా వినకుండా వారితో వాగ్వాదం చేశారు. దీంతో గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ చెరువులో నల్లమట్టిని స్థానిక రైతులు వ్యవసాయ భూములకు తరలించేవారు. అయితే శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేయడంతో ట్రాక్టర్ డ్రైవర్ దివాకర్ గాయపడ్డాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో శనివారం చెరువు నుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్లకు దారి పొడవునా ట్రాక్టర్లు అడ్డుకున్నారు. విషయం తెలిసి గోనెగండ్ల సీఐ చంద్రబాబు అక్కడి వచ్చి గ్రామస్తులు, రైతులను సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు.
రెండు అనుమతులా?
చెరువులో నల్లమట్టిని తరలించేందుకు ఇటుకల వ్యాపారుల పేరుపై ఈనెల 10 నుంచి 17వరకు ఒక అనుమతి, మరొకటి రైతుల పేరుపై ఈనెల 10 నుంచి 25 వరకు మరో అనుమతి ఇవ్వడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు షాడో ఎమ్మెల్యేకు లక్షలు ముట్టజెప్పారని ఆరోపించారు. శుక్రవారానికే గడువు తీరిందని శనివారం వచ్చిన టిప్పర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం మరో అనుమతి ఉత్తర్వులను తెచ్చుకున్నామని ఇటుకల వ్యాపారులు తెలపడంతో గ్రామస్తులు శాంతించారు. అయితే సాయంత్రం మరో అనుమతితో చెరువు మట్టిని తరలించే ప్రక్రియను ప్రారంభించడంతో గ్రామస్తులు జీర్ణించుకోలేకపోరున్నారు. రైతులు తమ భూములకు నల్ల మట్టిని తరలించాల్సి ఉండగా సాయంత్రం నుండి అవే టిప్పర్లు ఎమ్మిగనూరు ఇటుకల బట్టీలకు తరలించడంపై గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైనా టిప్పర్లను అడ్డుకొంటే చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.


