చిలకలడోణ ప్రమాదంలో మరో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

చిలకలడోణ ప్రమాదంలో మరో ఇద్దరు మృతి

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

మంత్రాలయం: చిలకలడోణ గ్రామ సమీపంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాద దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు పెద్దాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. శనివారం చిక్‌మంగళూరు జిల్లా శెట్టిగెర గ్రామానికి చెందిన శుభ (35), కన్నైనతన హళ్లి గ్రామానికి చెందిన జయమ్మ (60) మృతి చెందారు. వీరి తలకు గాయాలు కావడంతో పరిస్థితి విషమించి మరణించారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన 22 మంది గూడ్స్‌ వాహనంలో మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి వస్తుండగా చిలకలడోణ గ్రామం దగ్గర గురువారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనలో లోలాక్షమ్మ మృతి చెందగా గాయపడిన ఆమె చిన్నకూతురు తేజస్విని (10వ తరగతి) శుక్రవారం మృతి చెందింది. శనివారం శుభ, జయమ్మ ఇద్దరు ప్రాణం విడిచారు. మృతురాలు శుభ కొడుకు దీపక్‌, కూతుళ్లు దీక్షిత, ధన్యశ్రీ కూడా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి మృతి కొడుకు, కూతుళ్లను మరింతగా కుంగదీస్తోంది. మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కర్నూలు పెద్దాసుపత్రిలో 9 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన నుంచి స్థానికులు కోలుకోలేకపోతున్నారు. శెట్టిగెర, కన్నైనతన హళ్లి, ఉదేవ గ్రామస్తులు ఈ విషాదం నుంచి కోలుకోలేక పోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement