కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన కళాశాల బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినులను ఆమె తన కార్యాలయంలో అభినందించారు. కర్నూలు ఎస్సీ కళాశాల బాలికల నెంబర్–1 వసతి గృహంలో ఫస్టియర్ విద్యార్థినులు ఎ.అంజలి(470), స్వరూప (468), శిరీష(447), మాధవి(439), టి.లక్ష్మిదేవి (434) తదితర 11 మంది విద్యార్థినులు 400కు పైగా మార్కులు సాధించారన్నారు. సెకండియర్‌లో నెంబర్–2 కళాశాల వసతిగృహం విద్యార్థినులు టి.గీత(955), యు. నాగజ్యోతి స్వరూప (929), నెంబర్–1 వసతిగృహం విద్యార్థినులు రూప(960), లక్ష్మిదేవి(957), జి.అహల్యా (941), మరో నలుగురు 900కు పైగా మార్కులు సాధించారన్నారు. కార్యక్రమంలో కర్నూలు సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి, వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం అధ్యక్షులు బి.సుంకన్న పాల్గొన్నారు.


