కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మసీదులకు సంబంధించిన పత్రాలను ఈ నెల 30వ తేదిలోగా అందజేస్తేనే ఆయా మసీదులకు చెందిన ఇమామ్, మౌజన్‌లకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు విడుదలవుతాయని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయిదా సబీహా పర్వీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మసీదు కమిటీ ప్రెసిడెంట్ లేదా ముత్తవలి ఆయా డాక్యుమెంట్లను జిల్లా వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో అందించాలన్నారు. మసీదు రిజిస్ట్రేషన్ కోసం మసీదుకు సంబంధించిన స్థలం పత్రాలను కచ్చితంగా సమర్పించాలన్నారు. ఏపీ స్టేట్ వక్ఫ్‌బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆదేశాలను ఆయా మసీదులకు చెందిన వారు తప్పక పాటించాలన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు నాలుగు పథకాలు
కర్నూలు(అర్బన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చు, సహజ మరణ ఆర్థిక సహాయం పథకాలను పునరుద్ధరించినట్లు ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. భవన నిర్మాణ గుర్తింపు కార్డు కలిగిన కార్మికుల కుటుంబ సభ్యులకు వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణ ఉపశమనానికి రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు లభిస్తుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పథకాల కింద ప్రయోజనం పొందేందుకు తమ దరఖాస్తులను సమీప సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 15న కార్మిక సంఘాల నాయకులతో అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో లబ్ధిదారులుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
కంటి ఆపరేషన్ల వివరాల నమోదు తప్పనిసరి
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ, ప్రైవేటు కంటి ఆసుపత్రుల్లో ఇకపై నిర్వహించే కంటి ఆపరేషన్లను తప్పనిసరిగా వెబ్‌పోర్టల్‌లో నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎంహెచ్‌ఓ తన ఛాంబర్‌లో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేది నుంచి దృష్టిలోప నివారణ వెబ్ పోర్టల్‌లో ఆపరేషన్ చేసిన రోగుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ హిమబిందు, ప్రభుత్వ, ప్రైవేటు కంటి ఆసుపత్రుల అధికారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
కర్నూలు(అర్బన్): అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు జంక్ ఫుడ్‌తో నష్టాలను, హెల్తీ ఫుడ్‌తో కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించాలని ఐసీడీఎస్ ఆర్‌జేడీ రోహిణి తెలిపారు. శుక్రవారం కర్నూలు అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయంలో పోషణ్ పక్వాడా ఉత్సవాలను నిర్వహించారు. అర్బన్ సీడీపీఓ అనురాధ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రోహిణి మాట్లాడుతూ మొదటి ఆరు సంవత్సరాల్లో పిల్లల మెదడు అభివృద్ధిని పెంపొందించడంపై దృష్టి సారించడం పోషణ్ పక్వాడా ముఖ్య ఉద్దేశమన్నారు. ఈనెల 19న అక్షయ తృతియ రోజున బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నందున బాల్య వివాహ రహిత భారత్ ప్రచారంలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. బాల్య వివాహాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1800–102–7222 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1098కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పోషక విలువలపై అవగాహన కల్పించే పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సీడీపీఓ సౌజన్య, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


