● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయమనోహారి
కర్నూలు(టౌన్): 2019 సంవత్సరం మే 30వ తేదీ నుంచే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చట్ట సభల్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు సముచిత గౌరవం కల్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయమనోహరి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం మించి మహిళలకు సీట్లు, పదవులు కేటాయింన ఘనత జగనన్నదేనన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పదవి, హోంమంత్రి పదవి, మహిళా సంక్షేమ శాఖలను మహిళలకే కేటాయించారన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రాణించాలని జగనన్న ఐదేళ్ల క్రితం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అమ్మ ఒడి, చేదోడు, ఆసరా, పొదుపు మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చారన్నారు.
మోసగించడం చంద్రబాబు నైతం
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మహిళలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. ఆడబిడ్డ నిధి ఇంటింటికి, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని హడా వుడి చేశారన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలు జగనన్నకు రుణపడి ఉంటారన్నారు.
ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
వైఎస్ జగన్ పాలన డార్క్ డేస్ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలను మాజీ డిప్యూటీ మేయర్, మాజీ జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుక, సిట్రా సత్యనారాయణమ్మ ఖండించారు. జగనన్న పాలనంతా మహిళలకు గోల్డెన్ డేస్ అన్నారు. జగనన్న పాలన గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను, మహిళా ఉద్యోగులను వేధించడం, దారుణంగా కొట్టడం వంటి ఘటనలు ఈ ప్రభుత్వంలో కోకొల్లలు అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దిశ చట్టం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చిన ఘనత జగనన్నదే అన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు కార్పొరేటర్లు మునెమ్మ, నగర అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ నాయకులు హేమలత, కమలా, కాంతమ్మ, లలితమ్మ,షేకూన్, స్వర్ణలత, విజయ లక్ష్మీ, రమిజాబీ పాల్గొన్నారు.


