కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్‌దండే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా డ్వామాలో విజిలెన్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎ.అశ్వినీకుమార్‌ను కర్నూలు డీడీఓగా నియమించారు. కర్నూలు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న జీవీ రమణారెడ్డిని కర్నూలు జిల్లా పరిషత్ సీఈఓగా నియమించిన విషయం విదితమే. అలాగే అనంతపురం నుంచి జి.శివశంకర్‌ను పత్తికొండ డీడీఓగా నియమించారు. ఈ నేపథ్యంలో అనంతపురం డీడీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగశివలీలను కర్నూలు డ్వామా ఏఓగా నియమించారు.
స్వీయ గణనలో పాల్గొనాలి
కర్నూలు(సెంట్రల్): స్వీయ గణనలో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం భారతదేశ జనగణన –2027లో భాగంగా డిజిటల్ విధానం ద్వారా కలెక్టర్ తన మొబైల్‌లో స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జనగణనకు సంబంధించి ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వయ గణనలో ప్రతి కుటుంబం పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వీయ గణన పక్రియ సులభమైనదని, వేగవంతమైనదని, దానిని పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే www.se.census.gov. in పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు.
పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు కీలకం
● సదరన్ రీజియన్ కమాండెంట్
మహేష్ కుమార్
కర్నూలు: పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మేకల మహేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో జిల్లాస్థాయి హోంగార్డులకు శుక్రవారం ‘ప్రత్యేక పరేడ్’ నిర్వహించారు. కార్యక్రమానికి కమాండెంట్ ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల విధులకు వెళ్లే హోంగార్డులు ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. సవాళ్లతో కూడుకున్న పోలీసు ఉద్యోగంలో ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. రోడ్డు భద్రతపై కూడా హోంగార్డులు అవగాహన కలిగి ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్తలు, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు.అనంతరం నిర్వహించిన దర్బార్‌లో హోంగార్డులు తమ సమస్యలను కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ ప్రసాద్, హోంగార్డ్స్ ఇన్‌చార్జి ఆర్‌ఐ పోతుల రాజు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.


