మృత్యు పంజా! | - | Sakshi
Sakshi News home page

మృత్యు పంజా!

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

చిలకలడోణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

చిలకలడోణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఘటనా స్థలంలో క్షతగాత్రులు

కర్నూలు (హాస్పిటల్‌): అప్పటి వరకు తనతో కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన భార్య, అపురూపంగా చూసుకుంటున్న కుమార్తె మృతిని కళ్లారా చూసి గుండెపగిలేలా రోదిస్తున్న వ్యక్తి ఒకరు.. చెట్టంతా కు మారుడు, ఇంటికి పెద్దగా ఉన్న తండ్రి లోకం వీడటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు.. తీవ్రంగా గాయపడి హహాకారాలు చేస్తున్న క్షతగాత్రు లను చూసి చీకట్లో మృత్యువు వికటాట్టహాసం చేసింది. అందరూ నిద్రలో ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వా హనం గమ్యానికి చేరువైంది. ఇంతలో ఉలిక్కిపాటు. రెప్పపాటులో ఘోరం. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ చీకట్లు.. ఆర్తనాదాలు. ఘటనా స్థలం రక్తసిక్తం. కొందరు అప్పటికే ప్రాణం విడిచారు. దైవ దర్శనానికి బయలుదేరిన భక్తులపై మృత్యువు పంజా విసిరింది. మలుపులో మాటు వేసి లారీ రూపంలో ఎనిమిది మందిని మింగేసింది. కొందరు గాఢ నిద్రలోనే కన్నుమూశారు. సమీపంలోని పల్లె ప్రజలు మృత్యుకేకతో ఉలికిపడ్డారు. మరి కొద్ది నిమిషాల్లో దైవ స్మరణలో తరలించాల్సిన వారిలో కొందరు విగతజీవులుగా మారగా.. మరి కొందరు క్షతగాత్రులై ఆసుపత్రి పాలయ్యారు. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారు జామున 3.20 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన యాత్రికులు గూడ్స్‌ వాహనంలో మంత్రాలయం వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఫయాస్‌ మిల్లర్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. ఎమ్మిగనూరు ఆసుపత్రిలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

క్షతగ్రాతుల భాష అర్థం కాక

వైద్యుల సతమతం..

చిలకలడోణ రోడ్డు ప్రమాద క్షతగాత్రులతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ హాహాకారాలు అక్కడి వారిని కలిచి వేశాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో అమృత(11), తేజస్విని(15), దీక్షిత(16), వర్షిత(19), శుభ (34), జయమ్మ(60), ధన్యశ్రీ(14), దీపక్‌(16), ప్రతాప్‌(14), సునీత(20), భారతి(40), సునీల్‌కుమార్‌(25) ఉన్నారు. వీరిలో తేజస్విని, శుభల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరికి కాళ్లు, చేతులు విరగ్గా, మరికొందరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో 12 నుంచి 15 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. వారు బాధతో అల్లాడిపోయారు. చికిత్స సమయంలో వారు వారికి వచ్చిన కన్నడ భాషలో నొప్పిగా, బాధగా ఉందని, ముట్టుకోవద్దని విలపించారు. మరోవైపు క్షతగాత్రులు ఏమి చెబుతున్నారో అర్థం గాక.. కన్నడ భాష అర్థం కాని వైద్యులు, సిబ్బంది చికిత్స అందించడంలో సతమతమయ్యారు. కన్నడ భాష స్వల్పంగా తెలిసిన వారు దగ్గరుండి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చిన్నారులు బాధతో విలవిలలాడి కొద్దిసేపు మూర్చపోయారు. చాలా మందికి అంతర్గతంగా అవయవాల్లో గాయాలు ఉండటంతో వారు కదలలేని స్థితిలో ఇబ్బంది పడ్డారు. క్షతగ్రాతులను కలెక్టర్‌ సిరి పరామర్శించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.

మృతులు తల్లీబిడ్డ వీణ, నిషిత (ఫైల్‌), ప్రమాదంలో బయటపడిన వీణ భర్త రాజేష్‌

ఎమినిమిది మంది మృత్యువాత,

12 మందికి తీవ్రగాయాలు

ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

అందరూ కర్ణాటక రాష్ట్ర వాసులే

క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

Advertisement
 
Advertisement
Advertisement