‘సీమ’ రగులుతోంది! | - | Sakshi
Sakshi News home page

‘సీమ’ రగులుతోంది!

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

రాయలసీమ లిప్ట్‌ సాధనకు పోరుబాట

రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబుపై ‘సీమ’ నేతలు ఉద్యమబాట పట్టారు. ‘సీమ’ ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఆపేసిన ‘రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌’ పూర్తి చేయాల్సిందేనని పోరుబాటకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు, తిరుపతి, కడప, అనంతపురంలో సభలు నిర్వహించారు. నేడు కర్నూలు కేంద్రంగా మరో సమావేశానికి సిద్ధమయ్యారు. రాయలసీమ లిఫ్ట్‌ ఆవశ్యకత, ప్రభుత్వ వంచన, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. – సాక్షి ప్రతినిధి కర్నూలు

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిలిపేయడంపై ఫిబ్రవరి నుంచి ‘సీమ’ రగులుతోంది. తెలంగాణ రైతులు, ప్రాంత ప్రయోజనాల కోసం చంద్రబాబుతో తాను మాట్లాడి ప్రాజెక్టును ఆపేశానని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ‘సీమ’ నివ్వెరపోయింది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన వ్యక్తి ఇలా మరోసారి రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఏంటనే చర్చ మొ దలైంది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల్లో నిజం ఉందా? లేదా? అనేది చర్చించాల్సింది పోయి రాయలసీమ ప్రాజెక్టుపై టీడీపీ నేతలు వితండవాదం చేస్తున్నారు. ఈక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రతీ జిల్లాలో సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నారు.

‘సీమ’ త్యాగాలకు

విలువ ఏముంది బాబూ!

శ్రీశైలం ప్రాజెక్టు ఏర్పాటుకు భూములు కోల్పోయింది, గ్రామాలు ఖాళీ చేసింది ‘సీమ’ ప్రజలే. ‘సీమ’ త్యాగాలతోనే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత జల ప్రయోజనాలను అన్ని ప్రాంతాలు అనుభవిస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కృష్ణాజలాలపై రెండు రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రాన్ని నియంత్రించే పరిస్థితి లేదు. ఈక్రమంలో త్యాగం చేసిన సీమకే తీవ్ర అన్యాయం జరుగుతోంది. అది కూడా సాక్షాత్తూ రాష్ట్రం ప్రభుత్వం చేయడం మరింత శోచనీయం. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడుకు 44వేల క్యూసెక్కుల నీరు అందాలంటే ప్రాజెక్టులో 881 అడుగులు ఉండాలి. తెలంగాణ 800 అడుగుల నుంచే రోజుకు 8 టీఎంసీలు తోడేస్తుంటే శ్రీశైలంలో నీటిమట్టం 881 అడుగులకు వచ్చే సరికి తెలంగాణ వంద టీఎంసీలుపైగా తోడేస్తుంది. ఒకవేళ శ్రీశైలంలో వరద ప్రవాహం తగ్గితే కేవలం తెలంగాణ మాత్రమే నీటిని తోడుకుంటుంది. ‘సీమ’కు చుక్క నీరు అందని పరిస్థితి.

జగన్‌ ముందు చూపే..

తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌తో పాటు పలు ప్రాజెక్టుల ద్వారా రోజూ 8 టీఎంసీలు తరలిస్తోంది. మరోవైపు కర్నాటకలో ఆల్మట్టిడ్యాం సామర్థ్యాన్ని 129 టీఎంసీల నుంచి, 229 టీఎంసీలకు అక్కడి ప్రభుత్వం పెంచుతోంది. తెలంగాణ, కర్నాటక చర్యలతో శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గిపోయే ప్ర మాదముంది. ఈ పరిణామాలను బేరీజు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రాయలసీమలిప్ట్‌కు శ్రీకారం చుట్టారు. తెలంగాణతో పాటు మనం కూడా 800 అడుగుల నుంచే నీటిని తోడుకునేలా రూ.3,850 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్మాణానికి ఉపక్రమించారు. రూ.1200కోట్లకు పైగా పనులు చేసి రూ.990కోట్ల విలువైన బిల్లులు కూడా చెల్లించారు.

రాయలసీమ ఎత్తిపోతలతో ఉమ్మడి కర్నూలు సస్యశ్యామలం

రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి కర్నూలు సస్యశ్యామలం అవుతుంది.

800 అడుగుల నుంచే తోడుకోవచ్చు కాబట్టి నెల ముందే సాగునీరు రైతులకు అందుతుంది.

ముందస్తు పంటలు సాగు చేసుకోవచ్చు.

హంద్రీ–నీవా ఫేజ్‌–2కు రాయలసీమ లిఫ్ట్‌ నుంచి నీరు ఇస్తారు.

మల్యాల ద్వారా ఫేజ్‌–2కు నీరు పంపాల్సిన అవసరం లేదు.

హంద్రీ–నీవా నీరు మొత్తాన్ని కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్రమే వాడుకోవచ్చు.

కర్నూలు జిల్లాలో హంద్రీ–నీవా పరిధిలో 79,300 ఎకరాల ఆయకట్టు ఉంది.

దీనికి సాగునీరు అందుతుంది. అలాగే మరిన్ని చెరువులకు నీరు అందించొచ్చు.

నంద్యాల జిల్లాలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడంతో నెల నుంచి రెన్నెళ్లు ముందుగానే సాగునీరు అందుతుంది.

ప్రాజెక్టులో నీటి నిల్వ 800 అడుగులకు తగ్గినా అవసరమైతే నీటిని తోడుకోవచ్చు.

ఇది తాగు, సాగునీటి వనరుల కల్పనకు దోహదపడుతుంది.

భవిష్యత్తులో కర్నూలు, నంద్యాల జిల్లాలో నీటినిల్వ ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీలు పెంచుకుని మరింత ఆయకట్టును స్థిరీకరించుకోవచ్చు.

ఎన్జీటీలో టీడీపీ నేతలతో కేసులు వేయించి పనులు ఆపేసిన టీడీపీ

రాయలసీమ లిఫ్ట్‌ పూర్తయితే జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఈర్ష్యతో టీడీపీ నేతలు మహబూబ్‌నగర్‌లోని టీడీపీ సానుభూతి పరులతో ఎన్జీటీ(నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌)లో కేసులు వేయించారు. దీంతో ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే ఇచ్చింది. అయితే ఎన్జీటీలో వాదనలు వినిపిస్తూనే పనులు ఆపకుండా భారీ భద్రత మధ్య అప్పటి ప్రభుత్వం 50శాతం పైగా పనులు చేసింది. ఎన్జీటీ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టిందని మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌తో పాటు పలువురు ఆరోపిస్తున్నారు. అదే సమస్య అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎందుకు ఎన్జీటీ అనుమతులు తీసుకోలేకపోతోందో సమాధానం చెప్పాలి.

ఏకమవుతున్న ‘సీమ’ జిల్లాల

నేతలు, ప్రజలు

నేడు కర్నూలులో వైఎస్సార్‌సీపీ నేతల

ఆధ్వర్యంలో సమావేశం

ఇప్పటికే పోతిరెడ్డిపాడు, కడప,

తిరుపతి, అనంతపురంలో

‘గ్రేటర్‌’ నేతల సభలు, సమావేశాలు

హాజరుకానున్న మాజీ మంత్రి

శైలజానాథ్‌, అనంత వెంకట్రామిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement