● వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి హెచ్చరిక
కర్నూలు(టౌన్): మంత్రి పదవి ఇవ్వలేదని పక్క పార్టీలోకి వెళ్లి ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఉగ్రవాదుల పార్టీ, ఐఎస్‌ఐ అంటూ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కొలుసు పార్థసారథి ఉపసంహరించుకోవాలని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సారథీ.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. అని హెచ్చరించారు. కర్నూలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని విషయంలో అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసి రూ.20 వేలకోట్లు ఖర్చుచేస్తే అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదనను అన్ని వర్గాల ప్రజలు, మేధావులు హర్షిస్తున్నారని చెప్పారు. ఇది మింగుడుపడని చంద్రబాబుకు కుట్రలకు తెరతీసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. మావిగన్ ప్రతిపాదనతో టీడీపీ మంత్రులకు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ముందు నుంచి అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తోందని చెప్పా రు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, పార్టీ కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామక్రిష్ణ మాట్లాడుతూ హౌసింగ్ మంత్రి పార్థసారథికి రాజకీయ భిక్ష పెట్టింది జగనన్న అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, పార్టీ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, పార్టీ నాయకులు బబ్లూ, కంటూ, పాషావలీ, పత్తాబాషా పాల్గొన్నారు.


