● 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): సూర్య ప్రతాపానికి ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలిలో తేమ మధ్యాహ్న సమయంలో 30 శాతం వరకు ఉంటే వడగాలుల తీవ్రత అంత తీవ్రంగా ఉండదు. అయితే 10 శాతం లోపునకు పడిపోవడంతో నిప్పులకొలిమిని తలపిస్తోంది. నంద్యాల జిల్లాలోని సంజామల మండలం ఏకంగా మండిపోతోంది. ఇక్కడి హీట్‌వేవ్‌ను రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఎల్లో అలర్ట్‌గా ప్రకటించింది. సంజామల మండలంలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ మండలంలో వరుసగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమనార్హం. గత ఏడాది ఇదే సమయంలో 43 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సారి ఏప్రిల్ మాసం మధ్యలోనే 44.6 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.


