పనులు సర్వేశ్వరుడికెరుక! | - | Sakshi
Sakshi News home page

పనులు సర్వేశ్వరుడికెరుక!

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

శ్రీగిరి క్షేత్రంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇంజినీర్ల కొరత

దేవస్థానంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు లేని వైనం

ఇద్దరు ఏఈలకు ఇన్‌చార్జ్‌ డీఈఈ హోదా

సహాయ ఇంజినీర్లు ఇద్దరే..

ఇంజినీర్ల కొరత..

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం వార్షిక బడ్జెట్‌ సుమారు రూ.300 కోట్లు ఉంటుంది. అందులో ఇంజినీరింగ్‌ విభాగానికి బడ్జెట్‌ అగ్రభాగం. భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో ఏటా సుమారు రూ.వంద కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఇంజినీరింగ్‌ విభాగంలో కొంత మందిదే హవా జరుగుతున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇంజినీర్ల కొరత స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్‌ విభాగంలో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ స్థాయి అధికారి ఉండాలి. గతంలో ఎస్‌ఈ పోస్టు మంజూరైనప్పటికీ దేవస్థాన ఈఓతో సమానమైన హోదా ఉంటుందని గతంలో పనిచేసిన ఈవోలు ఆ పోస్టును తొలగించారు. ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లు ఇద్దరు ఉండాలి. వీరికి బీటెక్‌ అర్హత ఉండాలి. అలాగే సివిల్‌–2, ఎలక్ట్రికల్‌–1, వాటర్‌ సప్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లు ఉండాలి. అలాగే హెడ్‌ డ్రాఫ్ట్‌స్‌మెన్‌–1, డ్రాఫ్ట్‌మెన్‌–2 ఉండాలి. అలాగే ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉండాలి. అంతేకాకుండా ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్స్‌, ఫ్టిర్‌, పంప్‌ ఆపరేటర్‌, సూపర్‌వైజర్స్‌, మేషన్‌ (మేస్త్రి), కార్పెంటర్‌, వెల్డర్‌, పెయింటర్‌, హెల్పర్స్‌ ఉండాలి. ప్రస్తుతం శ్రీశైల దేవస్థానంలో ఎస్‌ఈ పోస్టు లేదు. అలాగే ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లులో ఒకరికి మాత్రమే బీటెక్‌ అర్హత ఉంది. మరొక ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు డిప్లొమా అర్హత ఉంది. నలుగురు డీఈఈలకు గాను ఎవరూ లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్‌, మరి కొంత మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్‌మెన్‌ ఒకరు మాత్రమే ఉన్నారు.

ఒకే ఒక్క డ్రాఫ్ట్‌మెన్‌..

ఇంజినీరింగ్‌ విభాగంలో అత్యంత కీలకమైన పోస్టు డ్రాఫ్ట్‌మెన్‌. క్షేత్రంలో హెడ్‌ డ్రాఫ్ట్‌మెన్‌ ఒకరు, ఇద్దరు డ్రాఫ్ట్‌మెన్‌ ఉండాలి. అయితే ప్రస్తుతం ఒక్క డ్రాఫ్ట్‌మెన్‌ మాత్రమే ఉన్నారు. టెండర్‌ ప్రతిపాదనలను పరిశీలించడం, తనిఖీ చేయడం, రేట్‌ కోడింగ్‌ తనిఖీ, టెక్నికల్‌, అడ్మినిస్ట్రేషన్‌ అనుమతులు తీసుకోవడం, బిడ్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేయడం, పేపర్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఈ–ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలవడం, టెక్నికల్‌ ఎవాల్యువేషన్‌, కండీషన్లు ప్రకారం కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారా.. లేదా? తదితర ముఖ్యమైన విధులు డ్రాఫ్ట్‌మెన్‌ నిర్వహిస్తారు. ఈయనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడుతుంటారని పలువురు కాంట్రాక్టర్లు సైతం ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్‌ విభాగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించి, అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతతో నిర్మించేలా పర్యవేక్షణ చేసేందుకు అవరమైన పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

పెద్దల ఆశీస్సులు ఆయనకే..

శ్రీశైల దేవస్థానంలో ఇద్దరు ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లు ఉంటే ఒకరికి బీటెక్‌ క్వాలిఫికేషన్‌ ఉండగా మరొకరికి డిప్లొమా క్వాలిఫికేషన్‌ ఉంది. రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిడితో బీటెక్‌ ఇంజినీర్‌కు ట్రాన్స్‌పోర్టు విభాగం తప్ప ఎటువంటి పనులు కేటాయించ లేదు. డిప్లొమా క్వాలిఫికేషన్‌ ఉన్న అతనికి కూటమి పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో ఆయనకు సివిల్‌ పనులు, వాటర్‌ విభాగం, ఎలక్రిక్టకల్‌ పనులు, సైట్‌ అలాట్‌మెంట్లు, మెటీరియల్‌ పరిమిషన్లు..ఇంకా అన్ని పనులు అప్పగించారు. ఆ సింహానికే అన్ని పనులు అంటూ స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. అలాగే ఇద్దరు ఏఈలకు డీఈఈగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఒకరికి సివిల్‌ (డిప్లమో మెకానికల్‌ అర్హత, ఆ తరువాత దూర విద్య ద్వారా డిప్లొమా సివిల్‌ చేశాడని సమాచారం), ఐటీఐ ఎలక్ట్రిషియన్‌ అర్హత ఉన్న మరొకరికి ఎలక్ట్రికల్‌ డీఈఈగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. క్షేత్రంలో జరుగుతున్న ఎలక్ట్రికల్‌, వాటర్‌ సప్‌లై పనులు ఈయనే పర్యవేక్షిస్తుంటాడు. అయితే ఎటువంటి అర్హతలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement