తపాలా శాఖలో పార్సిల్‌ బుకింగ్‌ కౌంటర్లు | - | Sakshi
Sakshi News home page

తపాలా శాఖలో పార్సిల్‌ బుకింగ్‌ కౌంటర్లు

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

కర్నూలు(అర్బన్‌): తపాలా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు తక్కువ ఖర్చుతో పార్సిల్‌ పంపించే సౌకర్యాన్ని కల్పించినట్లు కర్నూలు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక హెడ్‌ పోస్టాఫీసులో నూతన పార్సిల్‌ బుకింగ్‌ కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు డివిజన్‌ పరిధిలోని కర్నూలు ప్రధాన తపాల కార్యాలయం, ఆదోని, కర్నూలు బీ క్యాంప్‌, ఎమ్మిగనూరు, డోన్‌ తపాలా కార్యాలయాల్లో పార్సిల్‌ బుకింగ్‌ కోసం ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించామన్నారు. ప్రైవేటు పార్సిల్‌ సంస్థల కంటే తక్కువ మొత్తం చార్జీలతో పోస్టల్‌ శాఖలో ఈ సౌకర్యాన్ని పొందవచ్చన్నారు.

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 135వ జయంతి

కర్నూలు(అర్బన్‌): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 135వ జయంతి ఉత్సవాలను ఈ నెల 14న నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పాత బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహానికి ఉదయం 9.30 గంటలకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారన్నారు. అనంతరం అక్కడే జయంతి సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, డీవీఎంసీ సభ్యులు, ఆయా కుల సంఘాల నాయకులు, ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆమె కోరారు.

21న ఎమ్మిగనూరులో జాబ్‌మేళా

కర్నూలు(సెంట్రల్‌): 11 ప్రైవేట్‌ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఈనెల 21న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. పది, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, పీజీ, బీటెక్‌ చదివిన 18 నుంచి 35 సంవత్సరాల్లోపు యువతీ, యువకులు ఆర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు naipunyam.a p.gov.in అనే వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారిణి దీప్తి పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌ అర్జీలను

వేగవంతంగా పరిష్కరించాలి

కర్నూలు(సెంట్రల్‌): పీజీఆర్‌ఎస్‌ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రీ ఆడిటింగ్‌ బృందాల ద్వారా అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచాలని సూచించారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ అనురాధ, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హెచ్‌ఈఈవోలకు పదోన్నతులు

కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌(హెచ్‌ఈఈఓ)లకు డిస్ట్రిక్ట్‌ మాస్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్స్‌(డెమో)గా పదోన్నతులు లభించాయి. వీరిలో ఇద్దరు పదోన్నతిపై కర్నూలుకు బదిలీ అయ్యారు. కర్నూలులోని రీజనల్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(ఎం)లో పనిచేస్తున్న కె.ధర్మేంద్ర పక్కనే ఉన్న ఫిమేల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు, కాకినాడలోని పీఓడీటీ కార్యాలయంలో పనిచేస్తున్న జి.నరేంద్రశేషును కర్నూలులోని మేల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు బదిలీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement