ఆత్మకూరు రూరల్: మండలంలోని సిద్దాపురం చెరువు సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. మండలంలోని సంజీవనగర తండాకు చెందిన నాగేశ్వరికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన అభిలాష్ (16)కు కుటుంబ సభ్యులు ఇటీవల కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనంపై అభిలాష్ బైర్లూటి వెళ్లి వస్తుండగా సిద్దాపురం చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. స్థానికులు గమనించి తీవ్రంగా గాయపడిన బాలుడి సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు. వారు ఆ బాలుడిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అభిలాష్ కోలుకోలేక సోమవారం మరణించాడు.
కూలిపోయిన రోడ్డు వంతెన గట్లు
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాలువపై రోడ్డు వేయడానికి వంతెన నిర్మించగా రెండు వైపులా గట్లు కూలిపోయాయి. దీన్ని గమనించిన ఓ ప్రయాణికుడు ప్రమాదకరంగా ఉందని చెప్పేందుకు కట్టెకు ఎర్రటి గుడ్డ చుట్టి పాతి వెళ్లి పోయాడు. గాజులదిన్నె గ్రామ స్టేజీ వద్ద ఈ రోడ్డు వంతెన మీదుగా ప్రతి రోజూ వందలాది వాహనాలు వెళ్తుంటాయి. వంతెన గట్లు లేవని ప్రయాణిస్తే వాహనాలు కాలువలోకి పడే అవకాశం ఉంది. ఈ దారి గుండా వాహనాల్లో వెళ్లే టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రమాదాన్ని చూసుకుంటూ వెళ్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు, ప్రయాణికులు అంటున్నారు.


