జగన్మాతా.. నమోస్తుతే! | - | Sakshi
Sakshi News home page

జగన్మాతా.. నమోస్తుతే!

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

సంప్రదాయబద్ధంగా శ్రీశైల భ్రమరాంబాదేవికి కుంభోత్సవం

గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలతోసాత్వికబలి

సీ్త్ర వేషధారణలో పురుషుడు అమ్మవారికి కుంభహారతి

శ్రీశైలంటెంపుల్‌: లోక కల్యాణం కోసం జగన్మాత అయిన శ్రీభ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుంభో త్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు, కుంభహారతి, సాత్వికబలి, అన్నాభిషేకం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు అమ్మవారికి సాత్విక బలిని సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ మేరకు శ్రీశైల మహాక్షేత్రంలోమంగళవారం అమ్మవారి కుంభోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పం పఠించారు. అమ్మవారికి ఏకాంత పూజల అనంతరం సాత్వికబలికి సిద్ధం చేసిన ఐదు వేలకుపైగా కొబ్బరికాయలు, 20 వేల గుమ్మడికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలు, వండిన అన్నం (కుంభం)కు పూజలు జరిపించారు. అనంతరం వాటిని అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు. తొలి విడత సాత్వికబలి ముగిసిన తర్వాత హరిహరరాయగోపుర ద్వారం వద్ద ఉన్న మహిషాసురమర్ధిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజలు చేసి సాత్వికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు.

నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు

శ్రీభ్రమరాంబాదేవికి విశేషపూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కలిగించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. చివరగా అమ్మవారికి పునఃపూజలను చేసి పలు రకాల వంటకాలతో అమ్మవారికి మహా నివేదన చేశారు. ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారికి కుంభహారతి..

సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. దీంతో ఉత్సవంలో ప్రధానఘట్టం ప్రారంభమైంది. అన ంతరం రెండో విడత సాత్వికబలిగా గుమ్మడికాయ లు,కొబ్బరికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీమల్లికార్జున స్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు. అలాగే అమ్మవారికి ఎదురుగా ఉండేవిధంగా సింహమండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా సమర్పించారు. కుంభోత్సవ పూజ కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతు లు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఏఈవో, పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement