కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని కర్మాగారాల్లో పటిష్టమైన భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కర్మాగారాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూపు మీటింగ్‌ను కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై తరచూ మాక్ డ్రిల్ నిర్వహించి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదకరమైన కర్మాగారాల్లో సబ్ కమిటీలు ఇచ్చిన నివేదికలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాదాలు జరిగితే వెంటనే తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఫ్యాక్టరీల విభాగం డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ నారాయణరెడ్డి జిల్లాలో ఉన్న కర్మగారాల్లో స్థితిగతులను కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో మునిషిపల్ అడిషనల్ కమిషనర్ కృష్ణ, డీఎంహెచ్‌ఓ కామేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, పీసీబీ ఈఈ పీవీ కిశోర్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
బాల్య వివాహాలకు
వ్యతిరేకంగా ప్రచారాలు
కర్నూలు(అర్బన్): ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథం’ ద్వారా కళాజాత ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ పి.విజయ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కర్నూలు, కల్లూరు, ఓర్వకల్ మండలాల్లోని సచివాలయాల పరిధిలో కళాజాత బృందాలు పాటలు, నాటికలు, నినాదాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాయన్నారు. కౌమార గర్భాల విషయంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా రెండవ స్థానంలో ఉండడంతో ప్రతి మండలంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రచార రథం ద్వారా ‘బేటీ బచావో–బేటీ పడావో ’ కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తుండటంతో కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ కర్నూలు ప్రాజెక్టు సీడీపీఓ అనురాధ, సూపర్‌వైజర్లు జరీనా, సుజాతచ వరలక్ష్మి, డీసీపీఓ శారద తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు
ఇక నుంచి ముఖహాజరు
కర్నూలు (అగ్రికల్చర్): ఉపాధి కూలీలకు ఇక నుంచి ముఖహాజరు వేసేందుకు చ్యలు తీసుకుంటున్నట్లు డ్వామా పీడీ నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని నాగులవాగు వంకలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ప్రతి గ్రామంలో వెంటనే ఉపాధి పనులు ప్రారంభించాలని, ఏదైనా గ్రామంలో పనులు కల్పించలేదని ఫిర్యాదులు అందితే సంబంధిత ఏపీఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లోని తన కార్యాలయం నుంచి ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి 30 మంది కూలీలకు కచ్చితంగా ఒక మేట్‌ను ఎంపిక చేసి వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రతిరోజూ ముఖ హాజరు వేయించాలని ఆదేశించారు. లక్ష్యాలకు దూరంగా ఉన్న నందవరం, పెద్దకడుబూ రు, ఆదోని, ఆలూరు, దేవనకొండ, వెల్దుర్తి, కర్నూలు, కల్లూరు, ఎమ్మిగనూరు మండలాల ఉపాధి సిబ్బంది లక్ష్యాలను రెండు రోజుల్లోపు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు పీడీ మాధవీలత కూడా పాల్గొన్నారు.


